‘క్రికెట్ పర్యాటకం’పై దృష్టి పెట్టండి!

16 Oct, 2014 01:22 IST|Sakshi
‘క్రికెట్ పర్యాటకం’పై దృష్టి పెట్టండి!

ప్రభుత్వానికి అనురాగ్ ఠాకూర్ విజ్ఞప్తి

 ధర్మశాల: అందమైన పర్వతాల మధ్య, ప్రకృతి సోయగంతో అందరినీ కట్టిపడేసే ప్రత్యేకత ధర్మశాల సొంతం. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ చిన్న పట్టణం శివారులోనే బౌద్ధుల మత గురువు దలైలామా నివాసముండే మెక్లియోగంజ్ కూడా ఉంది. అయితే క్రికెట్ మ్యాచ్‌లకు వేదికగా మారిన తర్వాతే ఈ ప్రాంతానికి ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది. పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఈ ప్రాంతంలో దాదాపు రూ. 200 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుంది.

దాదాపు రెండేళ్ల తర్వాత ఒక వన్డే మ్యాచ్‌కు ఈ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తోంది. శుక్రవారం భారత్, వెస్టిండీస్ మధ్య ఇక్కడ నాలుగో వన్డే జరగనుంది. అయితే పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకట్టుకునే సౌకర్యాల విషయంలో మాత్రం ఇది చాలా వెనుకబడి ఉంది. ఒక్క ఫైవ్ స్టార్ హోటల్ కూడా లేకపోవడం, రైలు మార్గం, రెగ్యులర్ ఫ్లయిట్‌లు లేకపోవడం సమస్యగా మారింది.

దీనిపై బీసీసీఐ సంయుక్త కార్యదర్శి, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ధర్మశాలకు క్రికెట్ ఎంతో గుర్తింపు తెచ్చింది. ఎన్నో సమస్యలు ఉన్నా అత్యుత్తమ స్టేడియంను నిర్మించగలిగాం. ఇక ఈ ప్రాంతానికి ప్రాచుర్యం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేను విస్తరించాలి. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే మరింత పర్యాటక అభివృద్ధి జరుగుతుంది’ అని ఠాకూర్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు