ఆమిర్ ను ఫీల్డ్ లోనే అభినందించా: కోహ్లీ

27 Feb, 2016 23:13 IST|Sakshi
ఆమిర్ ను ఫీల్డ్ లోనే అభినందించా: కోహ్లీ

మిర్పూర్: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో మూడేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై, క్లీన్ చిట్ తో రీ ఎంట్రీ ఇచ్చి సత్తాచాటుతోన్న పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ కు ఎల్లడలా అభినందనలు లభిస్తున్నాయి. భారత్ తో శనివారం నాటి మ్యాచ్ లో అద్భుత మైన బౌలింగ్ చేసిన ఈ యువ సంచలనం.. కొద్దిసేపు భారత అభిమానులను కంగారు పెట్టాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో భారత బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా ఆమిర్ పై ప్రశంసల జల్లు కురుపించాడు.

'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకునేందుకు వేదికపైకొచ్చిన కోహ్లీ.. వ్యాఖ్యాతతో మాట్లాడుతూ 'అద్భుతంగా బౌలింగ్ చేసిన మొహమ్మద్ ఆమిర్ కు నా అభినందనలు. ఇవాళ అతను బాల్ విసిరిన తీరు నిజంగా అద్భుతం. నిజానికి ఫీల్డ్ లో ఉన్నప్పుడే నేనతన్ని అభినందించా' అని చెప్పాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో విఫలం కావటం బాధనిపించిందని, అందుకే ఈ మ్యాచ్ లో కసితీరా ఆడానని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై పరుగులు రాబట్టడం అంత సులువేమీకాదని, అయితే కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా ఆడేందుకు ప్రయత్నించానని వివరించాడు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. పాకిస్థాన్ ను 83 పరుగులకే ఆలౌట్ చేయగా, 15.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసిన భారత్.. పాక్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 51 బంతుల్లో 49 పరుగులు చేసిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. నాలుగు ఓవర్లు వేసిన ఆమిర్ కేవలం 18 పరుగులిచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు.

మరిన్ని వార్తలు