షిల్లింగ్‌ఫోర్డ్‌పై ఐసీసీ నిషేధం

17 Dec, 2013 03:46 IST|Sakshi
షిల్లింగ్‌ఫోర్డ్‌పై ఐసీసీ నిషేధం

దుబాయ్: భారత పర్యటనలో రాణించిన వెస్టిండీస్ ఆఫ్ స్పిన్నర్ షేన్ షిల్లింగ్‌ఫోర్డ్‌పై ఐసీసీ వేటు వేసింది. అతడి బౌలింగ్ శైలి వివాదాస్పదంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మరో ఆఫ్ స్పిన్నర్ మార్లన్ శామ్యూల్స్ ట్వీకర్ బంతులు కూడా నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. స్వతంత్ర బయోమెకానికల్ విశ్లేషణ ద్వారా షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగ్‌ను పరీక్షించగా ఐసీసీ అనుమతించిన 15 డిగ్రీలకు మించి అదనంగా మోచేయిని తిప్పినట్టు తేలింది.

దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగ్ చేయడాన్ని నిషేధిస్తున్నట్టు, మరో తాజా విశ్లేషణ సమర్పించేదాకా అతడు బౌలింగ్ చేసే అవకాశం లేదని ఐసీసీ పేర్కొంది. ఆఫ్ బ్రేక్ డెలివరీతో పాటు తన దూస్రా కూడా ఇదే రీతిన ఉన్నాయని బయోమెకానికల్ విశ్లేషణలో తేలింది. అలాగే ఆల్‌రౌండర్ శామ్యూల్స్ ప్రామాణిక బౌలింగ్ సరిగానే ఉన్నా ట్వీకర్ (వేగంగా విసరడం) బంతులు మాత్రం ఐసీసీ పరిమితి దాటి ఉండడంతో చట్టవిరుద్ధమని తేలింది. ఇకముందు తను ఇలాంటి బంతులను వేయడం కుదరదని తేల్చింది. గత నెల 29న వీరిద్దరికి పెర్త్‌లో బౌలింగ్ పరీక్ష జరిగింది. మరోవైపు తమ నిషేధంపై బౌలింగ్ రివ్యూ గ్రూప్‌నకు వీరు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వారు 14 రోజుల్లో ఐసీసీకి తెలపాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు