రొనాల్డో కిక్ ఇస్తే...

26 Jul, 2013 05:00 IST|Sakshi
రొనాల్డో కిక్ ఇస్తే...

లండన్: చురకత్తికి పదునుంటుందో లేదో కానీ... సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కిక్‌లో మాత్రం పవర్ ఉంటుంది. ఆ పవర్ ఎంతంటే... చేయి విరిగేంత! ఔను... ఇది నిజం. ఇకపై అతని ధాటికి ప్రత్యర్థి గోల్ కీపరే కాదు... గోల్ పోస్ట్ వెనకున్న ప్రేక్షకులు కూడా జాగ్రత్తగా ఉండాలేమో.
 
 ఎందుకంటే అంతటి వేగం ఆపతరం కాదేమో మరి. ఇంగ్లండ్‌లోని గోల్డ్‌సాండ్స్ స్టేడియంలో విఖ్యాత జట్టు రియల్ మాడ్రిడ్, స్థానిక ఫుట్‌బాల్ క్లబ్ ఏఎఫ్‌సీ బౌర్న్‌మౌత్ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఇందులో క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న మాడ్రిడ్ జట్టు 6-0 గోల్స్‌తో విజయం సాధించింది.
 
  మ్యాచ్ సందర్భంగా రొనాల్డో కొట్టిన ఫ్రీ కిక్ ప్రత్యర్థి గోల్‌పోస్ట్ బార్ పైనుంచి వేగంగా ప్రేక్షకుల స్టాండ్స్‌లోకి దూసుకెళ్లింది. గోల్‌పోస్ట్‌కు 35 అడుగుల దూరం నుంచి తన్నడంతో అంతేవేగంగా పోస్ట్ వెనకున్న 11 ఏళ్ల చార్లీ సిల్వర్‌వుడ్ ఎడమ చేయిని విరగొట్టింది. ఈ సంఘటన ఆట ఆరంభమైన ఆరో నిమిషంలోనే జరిగింది.
 
  గాయంతో విలవిలలాడిన ఆ పసి బాలుడు మాత్రం నొప్పినంతా భరించి 90 నిమిషాల మ్యాచ్ అసాంతం చూడటం గమనార్హం. విషయం తెలుసుకున్న క్రిస్టియానో తన ఆటోగ్రాఫ్‌తో పాటు సహచరులు సంతకాలు చేసిన జెర్సీని బహుకరించి చార్లీని ఊరడించాడు. కలిసి ఫొటోలు కూడా దిగాడు.
 

మరిన్ని వార్తలు