భారత్ ‘హ్యాట్రిక్’

29 Aug, 2013 01:54 IST|Sakshi
భారత్ ‘హ్యాట్రిక్’

ఇపో (మలేసియా): అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ భారత హాకీ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్‌లో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 9-1 గోల్స్ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్ తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘టాపర్’గా నిలిచింది. భారత్ తరఫున ‘డ్రాగ్ ఫ్లికర్స్’ రఘునాథ్ (29వ, 52వ, 59వ నిమిషాల్లో), రూపిందర్ పాల్ సింగ్ ‘హ్యాట్రిక్’లు సాధించారు.  రూపిందర్ (4వ, 19వ, 27వ, 61వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌తో కలిపి నాలుగు గోల్స్ చేయడం విశేషం. నికిన్ తిమ్మయ్య (25వ నిమిషంలో), మలాక్ సింగ్ (47వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బంగ్లాదేశ్‌కు రెహ్మాన్ చాయాన్ 35వ నిమిషంలో ఏకైక గోల్‌ను అందించాడు.
 
 వర్షం కారణంగా ఈ మ్యాచ్ నిర్ణీత సమయంకంటే 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆట నాలుగో నిమిషంలో రూపిందర్ చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన భారత్ ఏదశలోనూ బంగ్లాదేశ్‌కు తేరుకోనీయలేదు. చిరుజల్లుల మధ్యే మ్యాచ్ మొత్తం సాగింది. ఈ మ్యాచ్‌కు ముందే సెమీఫైనల్ బెర్త్ ఖాయం కావడంతో భారత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడింది. సమన్వయంతో కదులుతూ గోల్స్ చేసే అవకాశాలను సృష్టించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తమకు లభించిన 10 పెనాల్టీ కార్నర్‌లలో ఆరింటిని గోల్స్‌గా మలిచింది.
 
 
 సెమీఫైనల్స్ రేపు
 పాకిస్థాన్ x దక్షిణ కొరియా
 సాయంత్రం గం. 5.00 నుంచి
 భారత్ x మలేసియా
 రాత్రి గం. 7.00 నుంచి
 

మరిన్ని వార్తలు