జోరు కొనసాగించాలి..!

29 Jan, 2016 00:43 IST|Sakshi
జోరు కొనసాగించాలి..!

సిరీస్ విజయంపై భారత్ గురి
ఆత్మవిశ్వాసంతో ధోని సేన
ఆసీస్‌తో నేడు రెండో టి20
వార్నర్, స్మిత్‌లకు విశ్రాంతి

టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంలా మొదలైన ఆస్ట్రేలియా టి20 సిరీస్‌లో భారత్‌కు ఆశించిన ఆరంభమే లభించింది. వన్డేల్లో చిత్తుగా ఓడిన ధోని సేన టి20 సిరీస్‌ను దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో జట్టు ఆత్మ విశ్వాసం మరింత పెరిగింది. మరో వైపు తొలి మ్యాచ్ ఓడిన ఆసీస్ కీలక ఆటగాళ్లు దూరం కావడంతో మరింత ఒత్తిడిలో పడింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు తర్వాతి పోరుకు సిద్ధమయ్యాయి.

మెల్‌బోర్న్: భారత్, ఆస్ట్రేలియా రెండో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు (శుక్రవారం) ఎంసీజీలో జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆసీస్ గడ్డపై టి20 సిరీస్ సొంతం చేసుకొని సంతృప్తిగా స్వదేశం వెళ్లవచ్చు. సిరీస్ కోల్పోకుండా ఉండేందుకు ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ చావో రేవోగా మారింది.

 యువీకి అవకాశం దక్కేనా!
గత మ్యాచ్‌లో ఘన విజయం అందించిన జట్టునే ఈ సారి కూడా భారత టీమ్ మేనేజ్‌మెంట్ కొనసాగించవచ్చు. బ్యాటింగ్‌లో కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉండగా, రోహిత్ తనదైన శైలిలో చెలరేగుతున్నాడు. రైనా ఆకట్టుకోగా, ధావన్ ఎప్పుడైనా చెలరేగిపోగలడు. కానీ ప్రస్తుతం భారత్‌కు సంబంధించి కీలక అంశం యువరాజ్ సింగ్ బ్యాటింగ్. ఎప్పుడో రెండేళ్ల క్రితం ఆఖరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అతను, దేశవాళీ ఫామ్‌తో ఎట్టకేలకు పునరాగమనం చేశాడు.

అయితే తగిన ప్రాక్టీస్ లేదంటూ ధోని అతడికి బ్యాటింగ్ అవకాశమే ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లోనైనా యువీ ఎక్కువ ఓవర్లు ఆడగలిగితే ప్రపంచ కప్ ప్రణాళికలు సిద్ధం చేయడం సులువవుతుంది. బౌలింగ్‌లో నెహ్రా, అశ్విన్, జడేజా రాణించగా, తొలి మ్యాచ్ ఆడిన బుమ్రా ఆకట్టుకున్నాడు. మరో కొత్త కుర్రాడు హార్దిక్ పాండ్యా ఎక్కువ పరుగులిచ్చినా మరో చాన్స్ ఖాయం. అవసరమైతే ఈ మ్యాచ్‌లో అతని బ్యాటింగ్ సామర్ధ్యం కూడా పరీక్షించవచ్చు. మొత్తంగా చూస్తే భారత్ ఈ ఫార్మాట్‌లో పటిష్టంగా కనిపిస్తోంది.

 మ్యాక్స్‌వెల్‌కు చోటు!
సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉన్నా...ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ టీమ్ ఎంపిక విషయంలో తాము ముందు గా అనుకున్న ప్రణాళికకే కట్టుబడింది. న్యూజిలాం డ్ తో సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు ముందే వెళుతున్న వార్నర్, స్మిత్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. గా యం కారణంగా గత మ్యాచ్ ఆడని మ్యాక్స్‌వెల్ తిరిగి వస్తున్నాడు.

మరో బ్యాట్స్‌మన్‌గా షాన్‌మార్ష్‌కు చోటు దక్కవచ్చు. తొలి మ్యాచ్‌లో టాప్‌స్కోరర్‌గా ని లిచిన కెప్టెన్ ఫించ్‌పై బాధ్యత మరింత పెరిగింది. లిన్, హెడ్‌లతో పాటు తమ ఆల్‌రౌండర్లు వాట్సన్, ఫాల్క్‌నర్ ఈ సారైనా చెలరేగాలని జట్టు కోరుకుం టోంది. తొలి టి20లో ముగ్గురు ప్రధాన బౌలర్లు 10 కంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు ఇచ్చారు. సీని యర్ టెయిట్‌కు మరో అవకాశం ఇచ్చి, బాయ్‌స్ స్థా నంలో ఆఫ్‌స్పిన్నర్ లయోన్‌ను ప్రయత్నించవచ్చు.

 జట్ల వివరాలు (అంచనా):
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, అశ్విన్, పాండ్యా, బుమ్రా, నెహ్రా
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), షాన్ మార్ష్, వాట్సన్, లిన్, మ్యాక్స్‌వెల్, హెడ్, వేడ్, ఫాల్క్‌నర్, టెయిట్, రిచర్డ్సన్/హేస్టింగ్స్, బాయ్‌స్/లయోన్.

 పిచ్, వాతావరణం
మెల్‌బోర్న్ ఇటీవల పూర్తిగా బ్యాటింగ్ పిచ్‌గా మారింది. భారత్, ఆసీస్ మధ్య జరిగిన వన్డేతో పాటు బిగ్‌బాష్‌లోనూ భారీగా పరుగులు వచ్చాయి. కాబట్టి ఈసారి కూడా అదే జరగొచ్చు. చిరుజల్లులు పడే అవకాశం ఉంది.

మహిళల మ్యాచ్ కూడా...
మరో వైపు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య కూడా నేడు రెండో టి20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్ సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది. అనూహ్యంగా ఓడిన ఆసీస్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

ఉ. గం. 9నుంచి
స్టార్ స్పోర్ట్స్1లో ప్రత్యక్ష ప్రసారం

>
మరిన్ని వార్తలు