సచిన్ సరసన కోహ్లి

4 Sep, 2017 16:19 IST|Sakshi
సచిన్ సరసన కోహ్లి

దుబాయ్: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో విశేషంగా రాణించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనతను సాధించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్ లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించిన రెండో భారత క్రికెటర్ గా నిలిచారు. తద్వారా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక రేటింగ్ పాయింట్ల రికార్డును సమం చేశారు. శ్రీలంకతో వన్డే సిరీస్ తరువాత కోహ్లి 887 రేటింగ్ పాయింట్లను సొంతం చేసుకున్నారు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ 887 రేటింగ్ పాయింట్లను సాధించిన ఏకైక భారత క్రికెటర్. 1998 లో సచిన్ ఈ ఫీట్ ను సాధించారు.

లంకేయులతో వన్డే సిరీస్ తరువాత కోహ్లి 14 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సిరీస్ కు ముందే వన్డేల్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లి.. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కంటే 26 పాయింట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వార్నర్ 861పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. లంకేయులతో వన్డే సిరీస్ లో కోహ్లి రెండు వరుస సెంచరీలతో దుమ్మురేపారు. ఆ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రికీ పాంటింగ్ తో కలిసి రెండో స్థానంలో నిలిచారు.

 

భారత బ్యాట్స్ మన్లలో రోహిత్ శర్మ తొమ్మిదో స్థానంలో ఉండగా, ఎంఎస్ ధోని పదో స్థానంలో ఉన్నారు. కాకపోతే మార్టిన్ గప్టిల్ తో కలిసి ధోని సంయుక్తంగా పదో ర్యాంకులో కొనసాగుతున్నారు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ లో బూమ్రా నాల్లో స్థానానికి ఎగబాకాడు.  లంకతో సిరీస్ లో 15 వికెట్లతో రాణించిన బూమ్రా ఏకంగా 27 స్థానాలను ఏకబాకి నాల్గో స్థానంలో నిలవడం విశేషం. ఇక్కడ హజల్ వుడ్(ఆస్ట్రేలియా) తొలి స్థానంలో, ఇమ్రాన్ తాహీర్(సౌతాఫ్రికా) రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా) ఉన్నాడు.

మరిన్ని వార్తలు