మనోళ్లు... ఎన్నాళ్లిలా..!

1 Sep, 2015 00:26 IST|Sakshi
మనోళ్లు... ఎన్నాళ్లిలా..!

ఉసేన్ బోల్ట్ పరుగు తీస్తుంటే ఊపిరి బిగబట్టుకుని చూశాం. కెన్యా ఇథియోపియా లాంటి దేశాల అథ్లెట్లు పతకాలు కొల్లగొడుతుంటే అవాక్కయ్యాం. మరి విశ్వవేదికపై మనమెక్కడ? 130 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారతదేశం ప్రపంచ అథ్లెటిక్స్ వేదికపై పతకాలు తెచ్చే అథ్లెట్స్‌ను ఎందుకు తయారు చేయలేకపోతోంది?
 
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చైనాలో వైభవంగా ముగిసింది. బోల్ట్ మెరుపులతో, ఇతర అథ్లెట్ల విన్యాసాలతో ప్రపంచం ఆనందించింది. కానీ చైనా పక్కనే ఉన్న భారత దేశం మాత్రం ఎప్పటిలాగే కళ్లు కాయలు కాచేలా పతకం కోసం ఎదురుచూసి నిరాశ చెందింది. నిజానికి మన అథ్లెట్లు ప్రపంచ పోటీల్లో పతకం తెస్తారనే ఆశ లేకపోయినా... మెరుగైన ప్రదర్శన కనబరచాలని కోరుకున్నాం. కానీ ఎప్పటిలాగే నిరాశనే మిగిల్చారు. గతంతో పోలిస్తే ఇంకా దిగజారారు కూడా. మనతో పోలిస్తే చాలా చిన్న దేశాలు కూడా పతకాలు కొల్లగొట్టాయి. కెన్యా ఎంతుంటుంది..? చాలా చిన్న దేశం. కానీ అథ్లెటిక్స్‌లో మాత్రం చెలరేగుతుంది. ఈసారి ఏకంగా ఏడు స్వర్ణాలతో కలిపి మొత్తం 16 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జమైకా ఏడు స్వర్ణాలతో కలిపి మొత్తం 12 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు చిన్న దేశాల ధాటికి గతంలో 10 సార్లు టాప్ ర్యాంక్‌లో నిలిచిన అమెరికా మూడో స్థానానికి పడిపోయింది.
 
ఆసియా స్థాయిలో ఫర్వాలేదు: ఆసియా స్థాయిలో భారత అథ్లెట్లు ఎప్పుడూ ఫర్వాలేదనే ప్రదర్శన కనబరుస్తారు. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో మనకు అన్నింటికంటే అత్యధికంగా అథ్లెటిక్స్‌లోనే 13 పతకాలు వచ్చాయి. ఇందులో రెండు స్వర్ణాలు కూడా ఉన్నాయి. మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా, 4x400 మీటర్ల రిలేలో మహిళల జట్టు స్వర్ణ పతకాలు సాధించాయి. ఈసారి ప్రపంచ అథ్లెటిక్స్‌కు సీమా అర్హత సాధించలేదు. రిలే జట్టు కేవలం హీట్స్ దశలోనే ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. ఆసియా క్రీడల్లో రజతాలు, కాంస్యాలు సాధించిన వారెవరూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తమ సత్తాను చాటుకోలేకపోయారు.
 
ఎందుకిలా?: ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించాలంటే మంచి మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన శిక్షణ ఉండాలి. అయితే ఇవి లేకుండా కూడా పతకాలు సాధించొచ్చని కెన్యా, ఇథియోపియా, ఎరిత్రియా లాంటి చిన్న దేశాల అథ్లెట్లు నిరూపించారు. మన దగ్గర క్రీడలకు చాలా దేశాలతో పోలిస్తే మంచి సదుపాయాలే ఉన్నాయి. అయితే శిక్షణ, సదుపాయాల్లో కచ్చితమైన ప్రమాణాలను పాటించడం లేదనేది కూడా అంగీకరించాల్సిన వాస్తవం.
 
మూలాల్లోకి వెళ్లాలి:
ఇంత పెద్ద దేశంలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు దొరకరు అనుకోలేం. కానీ ప్రాథమిక స్థాయిలోనే మంచి అథ్లెట్లను ఒడిసిపట్టుకునే వ్యవస్థ లేకపోవడం అసలు సమస్య. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో జరిగే పోటీలపై దృష్టి పెట్టడం, పాఠశాల క్రీడలను మెరుగుపరచడం ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ వీటిని ప్రణాళికా బద్ధంగా నిర్వహించే పరిస్థితి మన దగ్గర లేదు. కాబట్టి వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ముందు మూలాల్లోకి వెళ్లి చిన్న వయసులోనే అథ్లెట్లను గుర్తించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే... ప్రపంచ పతకం కోసం తర్వాతి తరాలు కూడా నిరీక్షించాల్సే ఉంటుంది.    -సాక్షి క్రీడావిభాగం
 
2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో  భారత్ ప్రస్థానం
- మొత్తం 206 దేశాలు పాల్గొన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో మూడు దేశాలతో సంయుక్తంగా 65వ స్థానంలో నిలిచింది. 33 ఏళ్ల ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో 2003లో అంజూ జార్జి లాంగ్‌జంప్‌లో కాంస్యం సాధించింది.
- 3000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో లలితా శివాజీ బాబర్ ఫైనల్లో ఎనిమిదో స్థానంలో నిలవడంతో ఒక్క పాయింట్ వచ్చింది. దీనివల్ల భారత్‌కు ప్లేసింగ్ టేబుల్‌లో కనీసం స్థానం దక్కింది.  
- మొత్తం 18 మంది అథ్లెట్లు ఈసారి పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో ఆరుగురు 4x400 మీ. రిలే జట్టు సభ్యులు. నేరుగా ఫైనల్స్ జరిగే విభాగాలను మినహాయిస్తే... కేవలం మూడు విభాగాల్లోనే భారత అథ్లెట్లు ఫైనల్‌కు చేరారు.

మరిన్ని వార్తలు