హైదరాబాద్‌కు నాలుగో ‘డ్రా’

18 Dec, 2018 10:06 IST|Sakshi

రాణించలేకపోయిన లోయరార్డర్‌

బెంగాల్‌కు 24 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం

రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీ 

సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు నాలుగో ‘డ్రా’ను నమోదు చేసింది. ఉప్పల్‌లో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడిలార్డర్‌ రాణించలేకపోవడంతో ప్రత్యర్థికి తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కోల్పోయి కేవలం ఒకే పాయింట్‌తో సరిపెట్టుకుంది. 24 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అందుకున్న బెంగాల్‌ ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి. ఓవర్‌నైట్‌ స్కోరు 204/4తో సోమవారం తమ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ 123.1 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. రోహిత్‌ రాయుడు (261 బంతుల్లో 93; 10 ఫోర్లు) సెంచరీని చేజార్చుకోగా... సాకేత్‌  సాయిరామ్‌ (39; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.

ప్రత్యర్థి బౌలర్లలో అశోక్‌ దిండా, ముకేశ్‌ కుమార్‌ చెరో 4 వికెట్లతో హైదరాబాద్‌ను కట్టడి చేశారు. షాబాజ్, ఇషాన్‌ పోరెల్‌ చెరో వికెట్‌ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బెంగాల్‌ ఆటముగిసే సమయానికి 14 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 49 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (2) వెంటనే ఔటయ్యాడు. అభిషేక్‌ కుమార్‌ (15 నాటౌట్‌), సుదీప్‌ చటర్జీ (30 నాటౌట్‌; 5 ఫోర్లు) రాణించారు. సీవీ మిలింద్‌కు ఒక వికెట్‌ దక్కింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 336 పరుగులు చేసింది. ఈనెల 22 నుంచి జరిగే తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌తో హైదరాబాద్‌ ఆడుతుంది.  
 
విఫలమైన లోయరార్డర్‌... 

ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ రాయుడు క్రితం రోజు స్కోరుకు కేవలం ఒక పరుగు మాత్రమే జోడించి ఆట ప్రారంభంలోనే ఔటయ్యాడు. దీంతో 203 పరుగులకు హైదరాబాద్‌ 5 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యతను సాకేత్‌ తీసుకున్నాడు. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ కేఎస్‌కే చైతన్య (60 బంతుల్లో 22; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 27 పరుగులు... సీవీ మిలింద్‌తో కలిసి ఏడో వికెట్‌కు 29 పరుగులు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. సాకేత్‌ ఓపికగా ఆడుతుండటంతో ఒక దశలో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం అందుకుంటుందేమో అనిపించింది. తనయ్‌ త్యాగరాజన్‌ (6) క్రీజులో నిలవలేకపోయినా... తర్వాత వచ్చిన సిరాజ్‌ (22; 3 ఫోర్లు) సాకేత్‌కు చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 42 పరుగుల్ని జోడించారు. కానీ రెండు పరుగుల వ్యవధిలో సిరాజ్, సాకేత్‌ వికెట్లను పడగొట్టి ముకేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌ ఆధిక్యానికి గండికొట్టడంతో ఆతిథ్యజట్టు 312 పరుగులకే పరిమితమైంది.   

స్కోరు వివరాలు 
బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌: 336; హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ ఎల్బీడబ్ల్యూ (బి) షాబాజ్‌ 18; అక్షత్‌ రెడ్డి (సి) అగ్నివ్‌ పాన్‌ (బి) అశోక్‌ దిండా 1; రోహిత్‌ రాయుడు (బి) ముకేశ్‌ కుమార్‌ 93; హిమాలయ్‌ అగర్వాల్‌ (సి) అనుస్తుప్‌ (బి) అశోక్‌ దిండా 65; సందీప్‌ (సి) అగ్నివ్‌ (బి) అశోక్‌ దిండా 13; చైతన్య ఎల్బీడబ్ల్యూ (బి) ముకేశ్‌ 22; సాకేత్‌ ఎల్బీడబ్ల్యూ (బి) ఇషాన్‌ 39; మిలింద్‌ (సి) అనుస్తుప్‌ (బి) ముకేశ్‌ 13; తనయ్‌ ఎల్బీడబ్ల్యూ (బి) అశోక్‌ దిండా 6; సిరాజ్‌ (సి) మనోజ్‌ తివారీ (బి) ముకేశ్‌ 22; రవికిరణ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (123.1 ఓవర్లలో ఆలౌట్‌) 312. 


వికెట్ల పతనం: 1–11, 2–38, 3–187, 4–203, 5–205, 6–231, 7–260, 8–268, 9–310, 10–312.  బౌలింగ్‌: అశోక్‌ దిండా 31–5–88–4, ముకేశ్‌ 27–8–54–4, ఆమిర్‌ 18–4–38–0, షాబాజ్‌ 20–6–43–1, ఇషాన్‌ 25.1–6–68–1, అనుస్తుప్‌ 1–0–4–0, మనోజ్‌ తివారీ 1–0–3–0. 
బెంగాల్‌ రెండో ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (నాటౌట్‌) 15; ఈశ్వరన్‌ (సి) చైతన్య (బి) మిలింద్‌ 2; సుదీప్‌ (నాటౌట్‌) 30; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (14 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 49. 

వికెట్ల పతనం: 1–2. బౌలింగ్‌: సిరాజ్‌ 5–2–15–0, మిలింద్‌ 5–1–14–1, రవికిరణ్‌ 2–0–13–0, తనయ్‌ 2–0–6–0.

>
మరిన్ని వార్తలు