రోస్‌బర్గ్ ఆరోసారి

27 Jul, 2014 01:24 IST|Sakshi
రోస్‌బర్గ్ ఆరోసారి

ఈ సీజన్‌లో మెర్సిడెస్ డ్రైవర్‌కు ఆరో పోల్
హామిల్టన్‌కు నిరాశ
నేడు హంగేరీ గ్రాండ్‌ప్రి
 
 బుడాపెస్ట్: ఈ సీజన్ ఫార్ములా వన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ జోరు కొనసాగుతోంది. ఈ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని చాటుతూ ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. రోస్‌బర్గ్‌కు ఇది వరుసగా మూడో పోల్ కావడం విశేషం.  
 
 శనివారం బుడాపెస్ట్‌లోని హంగరోరింగ్ సర్క్యూట్‌లో వర్షం కారణంగా నాటకీయంగా సాగిన హంగేరీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో... రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా 1 నిమిషం 22.715 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు. ఇక రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్... రోస్‌బర్గ్ కన్నా 0.486 సెకన్లు వెనకబడి రెండో స్థానంలో నిలవగా.. విలియమ్స్ రేసర్ బొటాస్‌కు మూడో స్థానం దక్కింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో స్థానం నుంచి, పెరెజ్ పదమూడో స్థానం నుంచి రేసును ప్రారంభించనున్నారు.
 
 హామిల్టన్ కారులో మంటలు
 గత ఏడాది ఇదే సర్క్యూట్‌లో పోల్ పొజిషన్ సాధించి, ప్రధాన రేసులో చాంపియన్‌గా నిలిచిన హామిల్టన్‌కు ఈ సారి నిరాశ తప్పలేదు. క్వాలిఫయింగ్ ఆరంభంలోనే మెర్సిడెస్ కారు వెనకవైపు నుంచి మంటలు రావడంతో రెండో ల్యాప్ నుంచే వెనుదిరిగాడు. సమయం నమోదు కాకపోవడంతో ఈ స్టార్ రేసర్‌కు 21వ స్థానం నుంచి ప్రధాన రేసును ప్రారంభిస్తాడు. ఇక ఈ సీజన్‌లో హామిల్టన్ కారులో ఏదో రకమైన సమస్యలు తలెత్తడం ఇది నాలుగోసారి. గత వారం జర్మనీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లోనూ హామిల్టన్‌కు అదృష్టం కలిసి రాలేదు. తొలి సెషన్‌లో అతని కారు బ్రేకులు ఫెయిలయ్యాయి.


 

మరిన్ని వార్తలు