పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటేనే... 

27 Dec, 2017 00:58 IST|Sakshi

వచ్చే ఏడాదీ మంచి ఫలితాలు

శ్రీకాంత్‌ ఆశాభావం

సాక్షి, న్యూఢిల్లీ: ‘ఈ ఏడాది సానుకూలంగా సాగింది. వచ్చే సంవత్సరం పలు పెద్ద టోర్నీలున్నాయి. వాటిలో రాణించి దేశానికి పతకాలు తేవాలంటే నేను వందశాతం ఫిట్‌నెస్‌తో ఉండటం కీలకం’ అని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ అన్నాడు. 2017లో నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలిచిన శ్రీకాంత్‌... 2018లో పలు సూపర్‌ సిరీస్‌ టోర్నీలతోపాటు కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఈవెంట్స్‌లో ఆడనున్నాడు.  

బుధవారం నుంచి ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో భాగంగా న్యూఢిల్లీ అంచె మ్యాచ్‌లు మొదలవుతాయి. దాంట్లో భాగంగా సింధు (చెన్నై స్మాషర్స్‌), శ్రీకాంత్‌ (అవధ్‌ వారియర్స్‌) ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా 2017లో ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకు శ్రీకాంత్‌తో పాటు రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఘనంగా సన్మానించింది. తమ అద్వితీయ ప్రదర్శనతో భారత ఖ్యాతిని పెంచుతున్న సింధు, శ్రీకాంత్‌లు దేశానికి గర్వకారణం అని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ అన్నారు. అంతకుముందు ఏపీ భవన్‌లోని బ్యాడ్మింటన్‌ కోర్టులో సింధు, శ్రీకాంత్‌లు కాసేపు షటిల్‌ ఆడి సందడి చేశారు. మరోవైపు సింధు మాట్లాడుతూ... కోర్టు ఉపరితలం నుంచి 1.15 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే సర్వీస్‌ చేయాలన్న ప్రయోగాత్మక నిబంధనను ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో కాకుండా మరెప్పుడైనా ప్రవేశ పెట్టాల్సిందని వ్యాఖ్యానించింది. అయితే సాధన చేస్తే తాజా నిబంధన తనకేమంత ఇబ్బంది కాదని పేర్కొంది. ప్రముఖ ఆటగాళ్లంతా వచ్చే ఏడాది తప్పనిసరిగా 12 టోర్నీల్లో పాల్గొనాలన్న నిబంధనపై మాట్లాడుతూ... ‘ఇప్పటికే షెడ్యూల్‌ వచ్చేసింది. ఆడకుండా దాని గురించి చెప్పలేం. నేను మాత్రం కోచ్‌తో చర్చించి ఎంపిక చేసిన టోర్నీల్లో పాల్గొనాలని భావిస్తున్నా’ అని సింధు పేర్కొంది.   

>
మరిన్ని వార్తలు