పంజాబ్ 327.. అసోం 326

14 Dec, 2015 20:29 IST|Sakshi

హైదరాబాద్:అసలు సిసలైన పోరాటానికి మరో మచ్చుతునక పంజాబ్-అసోంల మధ్య జరిగిన వన్డే మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 327 పరుగులు చేస్తే.. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అసోం చివరికంటూ పోరాడి ఒక పరుగు తేడాతో ఓడింది. ఇందుకు నగరంలోని జింఖానా మైదానం వేదికైంది. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా గ్రూప్-ఏలో అసోంతో సోమవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఓటమి అంచుల వరకూ వెళ్లి బయటపడింది. తొలుత టాస్ గెలిచిన అసోం  ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది.  ఓపెనర్లు పర్గత్ సింగ్(69), జీవన్ జోత్ సింగ్(32) శుభారంభాన్నివ్వగా, అనంతరం మన్ దీప్(117 నాటౌట్; 97 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్సర్లు),  గుర్ కీరత్ సింగ్ (62; 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేశారు. వీరికి తోడుగా యువరాజ్ సింగ్ (36) ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ ర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన అసోం  అందుకు దీటుగా బదులిచ్చింది. ఓపెనర్ పాల్వకుమార్ దాస్(1) వికెట్ ను తొలి ఓవర్ లోనే కోల్పోయినా,  అనంతరం స్వరూపం పూర్ కయస్తా(125; 112 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్) శతకాన్ని నమోదు చేశాడు. అటు తరువాత అమిత్ వర్మ(71), గోకుల్ శర్మ(60)లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఆ దశలో అస్సాం గెలుపు దిశగా పయనించింది. 28 పరుగుల వ్యవధిలో ఈ జోడీ పెవిలియన్ కు చేరడంతో ఆ భారం చివరి వరస ఆటగాళ్లపై పడింది. ఆఖర్లో సయ్యద్ మహ్మద్(22), సిన్హా(20), వాసిక్యూర్ రెహ్మాన్(11) జట్టును గెలిపిద్దామని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో అసోం నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 326 పరుగులకు పరిమితమై ఓటమి పాలైంది.

మరిన్ని వార్తలు