సచిన్.. నీ పూర్తి పేరేంటి?

13 Nov, 2015 15:44 IST|Sakshi
సచిన్.. నీ పూర్తి పేరేంటి?

న్యూయార్క్: సచిన్ టెండూల్కర్.. ప్రపంచమంతా క్రికెట్ దేవుడిగా పిలవబడుతున్న ఈ పేరు అందరికీ సుపరిచతమే. కాగా, బ్రిటీష్ ఎయిర్ వేస్ కు మాత్రం సచిన్ పూర్తి పేరు తెలియదట. ఇదే విషయాన్నిబ్రిటీష్ ఎయిర్ వేస్ తాజాగా స్పష్టం చేసి అందర్నీ ఆశ్చర్యంలోకి నెట్టింది. అమెరికా ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఆ దేశ పర్యటనలో ఉన్న సచిన్ కు బ్రిటీష్ ఎయిర్ వేస్ నుంచి వచ్చిన సమాధానమిది. ఏ సామాన్యుడికో సచిన్ పేరు తెలియదంటే సర్లే తెలియదేమో అనుకోవచ్చు. ప్రముఖ బ్రిటీష్ ఎయిర్ వేస్ కు సచిన్ పేరు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది.  అందులోనూ క్రికెట్ ను శ్వాసగా భావించే బ్రిటన్ దేశపు ఎయిర్ లైన్స్ నుంచి ఇటువంటి ప్రశ్న రావడం మాత్రం నిజంగా మింగుడు పడని విషయమే.
 

 

ఎప్పుడూ కూల్ గా ఉంటూ, వివాదాలకు దూరంగా ఉండే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు కోపం రావడానికి కారణం బ్రిటీష్ ఎయిర్ వేస్ వ్యవహరించిన తీరు. అమెరికాలో నిర్వహిస్తున్న ఆల్ స్టార్స్ క్రికెట్ లో భాగంగా సచిన్ తన కుటుంబంతో కలిసి వివిధ నగరాల్లో ప్రయాణించేందుకు బ్రిటీష్ ఎయిర్ వేస్ టికెట్లను బుక్ చేసుకున్నాడు. అయితే బ్రిటీష్ ఎయిర్ వేస్ మాత్రం కుటుంబ సభ్యుల టికెట్లను రిజర్వ్ చేయకుండా  వెయిటింగ్ లిస్ట్ లో పెట్టింది. దీంతో పాటు సచిన్ వెంట తీసుకునే వెళ్లే లగేజి విషయంలో కూడా కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించింది.  దీంతో అతని పర్యటన ప్రణాళికలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. న్యూయార్క్, హోస్టన్ ల జరిగిన మ్యాచ్ ల సందర్భంగా చోటు చేసుకున్న ఈ ఘటనపై సచిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

 

బ్రిటీష్ ఎయిర్ వేస్ తనపట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ సచిన్ అసహనం వ్యక్తం చేశాడు. బ్రిటీష్ ఎయిర్ వేస్ తనపై చూపించిన నిర్లక్ష్యం ఉద్దేశ్య పూర్వకంగా చేసినట్లుగానే ఉందని సచిన్ ట్విట్టర్ లో విమర్శించాడు.  కాగా, దీనిపై సచిన్ కు బ్రిటీష్ ఎయిర్ వేస్ క్షమాపణలు చెప్పింది. ట్రావెలింగ్ లో చోటు చేసుకున్న ఇబ్బందులకు చింతిస్తునట్లు రీ ట్వీట్ చేసింది.  సచిన్ యొక్క పూర్తి పేరు తెలియకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగిందంటూ సర్దిచెప్పుకునే యత్నం చేసింది. అయితే సచిన్ ట్వీట్ ను బ్రిటీష్ ఎయిర్ వేస్ ట్విట్టర్ అకౌంట్ టైమ్ లైన్ నుంచి తొలగించింది.  దీనిపై ఇప్పటికే పలువురు నెటిజన్లు రీట్వీట్ల ద్వారా బ్రిటీష్ ఎయిర్ వేస్ తీరును తప్పుబట్టారు.



 

 

మరిన్ని వార్తలు