మనోళ్లకు క్లిష్టమైన డ్రా

26 Jul, 2016 23:46 IST|Sakshi
మనోళ్లకు క్లిష్టమైన డ్రా

ఒలింపిక్స్ బ్యాడ్మింటన్
ముంబై: రియో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ సైనాకు గ్రూప్ ‘జి’లో... తొమ్మిదో సీడ్ సింధుకు గ్రూప్ ‘ఎం’లో... పురుషుల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్ శ్రీకాంత్‌కు గ్రూప్ ‘హెచ్’ లో చోటు దక్కింది. సైనా గ్రూప్‌లో మరియా ఉలిటినా (ఉక్రెయిన్), లొహెని విసెంటి (బ్రెజిల్)... సింధు గ్రూప్‌లో మిచెల్లి లీ (కెనడా), లారా సరోసి (హంగేరి), శ్రీకాంత్ గ్రూప్‌లో హెన్రీ హుర్స్‌కెనైన్ (స్వీడన్), లినో మునోజ్ (మెక్సికో) ఉన్నారు.  గ్రూప్ ‘టాపర్లు’ మాత్రమే నాకౌట్ దశ (ప్రిక్వార్టర్ ఫైనల్స్)కు అర్హత సాధిస్తారు.

‘డ్రా’ ప్రకారం ప్రిక్వార్టర్స్‌లో సైనాకు పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్)... క్వార్టర్స్‌లో లీ జురుయ్ (చైనా), సెమీస్‌లో టాప్ సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్); సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లో తై జు యింగ్ (చైనీస్ తైపీ), క్వార్టర్స్‌లో యిహాన్ వాంగ్ (చైనా), సెమీస్‌లో ఒకుహారా (జపాన్) లేదా రచనోక్ (థాయ్‌లాండ్) ఎదురయ్యే అవకాశముంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఐదో సీడ్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో... క్వార్టర్ ఫైనల్లో లిన్ డాన్ (చైనా)తో సెమీస్‌లో లీ చోంగ్ వీ (మలేసియా)తో తలపడే అవకాశముంది.

మరిన్ని వార్తలు