తగని నిర్ణయం తీసుకుంటే ‘సుప్రీం’కు

3 May, 2017 23:04 IST|Sakshi
తగని నిర్ణయం తీసుకుంటే ‘సుప్రీం’కు

సీఓఏ నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎమ్‌)లో బీసీసీఐ భారత క్రికెట్‌ భవిష్యత్తుకు మింగుడు పడని నిర్ణయం తీసుకుంటే సుప్రీం కోర్టుకు వెళదామని పరిపాలక కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. దేశ క్రికెట్‌ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించాలని... అలా కాకుండా ప్రతిష్టకు పోయి ఏకపక్షంగా మొండివైఖరి అవలంభిస్తే చూస్తూ ఊరుకోబోమని   రాష్ట్ర సంఘాలకు రాసిన లేఖలో సీఓఏ హెచ్చరించింది. ‘బిగ్‌–3’ ఫార్ములాకు వ్యతిరేకంగా ఐసీసీ వ్యవహరించడంతో ఇంగ్లండ్‌ ఆతిథ్యమిచ్చే చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి తప్పుకోవాలని బీసీసీఐలోని కొందరు పెద్దలు గట్టిగా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు ముందే తెలపాలని సీఓఏ సూచించిన సంగతి తెలిసిందే.

ఐసీసీతో ఇంకా సంప్రదింపుల ప్రక్రియ ముగిసిపోలేదని ఏదేమైనా చర్చల ద్వారా సాధించుకోవాలని సీఓఏ భావిస్తోంది. దీనిపై ఆ లేఖలో పాయింట్ల వారిగా పలు అంశాలను ప్రస్తావించింది. లేఖలోని 13వ పాయింట్‌లో ‘మొత్తం భారత క్రికెట్‌ ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకునే నిర్ణయాలకు సీఓఏ మద్దతిస్తుంది’ అని స్పష్టం చేసింది. అయితే దీనికి విరుద్ధంగా ప్రయోజనాలను పక్కనబెట్టి కేవలం తమ ప్రతిష్టకు పోతే సహించమని... తప్పకుండా సుప్రీమ్‌ కోర్టును ఆశ్రయిస్తామని సీఓఏ హెచ్చరించింది. ఇందులో అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలను కోరతామని చెప్పింది. ఆదాయ పంపిణీపై ఐసీసీతో వైరం కాకుండా ముందుగా చర్చల ద్వారా పరిష్కారానికే ప్రాధాన్యమివ్వాలని  10వ పాయింట్‌లో ఉదహరించింది. మొండి పట్టుదలకు పోకుండా పట్టువిడుపులు ప్రదర్శించాలని సీఓఏ ఆ లేఖలో పేర్కొంది. ఎస్‌జీఎమ్‌లో ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా లోతైన కసరత్తు చేయాలని రాష్ట్ర సంఘాలకు సూచించింది.

మరిన్ని వార్తలు