పోరాడి ఓడిన భారత్‌ 

4 Mar, 2018 04:36 IST|Sakshi

     రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ అర్జెంటీనా చేతిలో 2–3తో ఓటమి

     అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నీ  

ఇఫో(మలేసియా): స్టార్‌ ఆటగాళ్లు లేకున్నా... సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నీ తొలి లీగ్‌ మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్‌ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ అర్జెంటీనాకు భారత్‌ గట్టిపోటీ ఇచ్చింది. తుదికంటా పోరాడి ఓడిపోయినా ఆ ఓటమిలో గౌరవం కనిపించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సర్దార్‌ సింగ్‌ నాయకత్వంలోని టీమిండియా 2–3 గోల్స్‌ తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. స్టార్‌ డ్రాగ్‌ ఫ్లికర్‌ గొంజాలో పిలాట్‌ (13వ, 24వ, 33వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌ గోల్స్‌తో అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత్‌ తరఫున అమిత్‌ రొహిదాస్‌ (26వ, 31వ నిమిషాల్లో) రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో నమోదైన ఐదు గోల్స్‌ కూడా పెనాల్టీ కార్నర్‌ల రూపంలోనే రావడం విశేషం. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడనుంది. 

తొలి పది నిమిషాల్లో బంతిపై ఆధిపత్యం చలాయించిన భారత్‌ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ సమయంలో అర్జెంటీనాకు రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. వాటిలో తొలి షాట్‌ను భారత డిఫెండర్లు అడ్డుకోగా... పిలాట్‌ కొట్టిన రెండో షాట్‌కు తిరుగులేకుండా పోయింది. దీంతో మ్యాచ్‌ ప్రారంభమైన 13వ నిమిషంలో అర్జెంటీనా తొలి గోల్‌ నమోదు చేసి 1–0తో ముందంజ వేసింది. 24వ నిమిషంలో పిలాట్‌ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో 2–0తో అధిక్యాన్ని పెంచుకుంది. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలో భారత్‌కు మూడు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి.

వాటిలో తొలి రెండు వృథా కాగా... మూడో ప్రయత్నంలో అమిత్‌ రొహిదాస్‌ గోల్‌గా మలచడంతో భారత్‌ 1–2తో ఆధిక్యాన్ని తగ్గించింది. 31వ నిమిషంలో అమిత్‌ మరో గోల్‌ చేయడంతో 2–2తో స్కోరు సమమైంది. అనంతరం పిలాట్‌ మరో గోల్‌ చేయడంతో అర్జెంటీనా 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ  సమయంలో మ్యాచ్‌కు వర్షం అడ్డుపడటంతో దాదాపు గంట పాటు ఆట నిలిచిపోయింది. తిరిగి ఆట ఆరంభమయ్యాక భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించినా స్కోరును సమం చేయలేకపోయారు.

మరిన్ని వార్తలు