విశాఖ వన్డే రద్దు

13 Oct, 2014 01:32 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారత్, వెస్టిండీస్‌ల మధ్య మంగళవారం వైజాగ్‌లో జరగాల్సిన మూడో వన్డే రద్దయింది. ‘హుదూద్' తుఫాన్ కారణంగా అతలాకుతలమైన విశాఖలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని బీసీసీఐ వెల్లడించింది. ఈ మ్యాచ్‌ను మరో తేదీకి మార్చాల్సిన అవసరం కూడా లేదని బోర్డు నిర్ణయించడంతో ఐదు వన్డేల సిరీస్ ఇప్పుడు నాలుగు మ్యాచ్‌లకే పరిమితమైంది.

‘ప్రతికూల వాతావరణం కారణంగా తర్వాతి వన్డే జరగడం లేదు. భారత జట్టు సోమవారం మధ్యాహ్నం వైజాగ్ వెళ్లాల్సి ఉన్నా ఇప్పుడు ఆ అవసరం లేదు. జట్టు ఢిల్లీలోనే ఉండబోతోంది’ అని టీమ్ మీడియా మేనేజర్ ఆర్‌ఎన్ బాబా ప్రకటించారు. అంతకు ముందు వైజాగ్‌లో వాతావరణ పరిస్థితులను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), బీసీసీఐకి వెల్లడించింది. ‘తాజా పరిస్థితిని మేం బోర్డుకు వివరించాం. ఆదివారం మధ్యాహ్నం తీవ్ర గాలి వేగానికి పిచ్‌పై కవర్లు కొట్టుకుపోయాయి.

స్టేడియంలో ఎలాంటి నష్టం జరిగిందో కనీసం వెళ్లి చూసే పరిస్థితి కూడా లేదు. మా గ్రౌండ్ సిబ్బంది పరిస్థితిపై కూడా ఆందోళనగా ఉన్నాం. ఏ రకంగా చూసినా మ్యాచ్ సాధ్యం కాదు’ అని ఏసీఏ మీడియా మేనేజర్ సీఆర్ మోహన్ చెప్పారు.  షెడ్యూల్ ప్రకారం నాలుగో వన్డే శుక్రవారం ధర్మశాలలో జరుగుతుంది. ఏర్పాట్లలో సమస్యల కారణంగా ఈ మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ వెనక్కి తగ్గిందని వార్తలు వచ్చినా... అన్నీ సమసిపోవడంతో ధర్మశాలలోనే నాలుగో వన్డే జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు