వాషింగ్టన్ సుందర్ కొత్త రికార్డు

22 May, 2017 15:50 IST|Sakshi
వాషింగ్టన్ సుందర్ కొత్త రికార్డు

హైదరాబాద్: ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరపున బరిలోకి దిగిన వాషింగ్టన్ సుందర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.  ఐపీఎల్ ఫైనల్ ఆడిన అత్యంత పిన్నవయస్కుడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-10లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్ తో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా వాషింగ్టన్ సుందర్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఫైనల్లో పాల్గొనే సమయానికి అతని వయసు 17 సంవత్సరాల 228 రోజులు. తద్వారా అంతకుముందు రవీంద్ర జడేజా పేరిట ఉన్న రికార్డును సుందర్ అధిగమించాడు. 2008లో రవీంద్ర జడేజా ఐపీఎల్ ఫైనల్ ఆడే సమయానికి అతని వయసు 19 ఏళ్ల 178 రో్జులు.  అదే ఇప్పటి వరకూ ఐపీఎల్ ఫైనల్ ఆడిన  పిన్నవయస్కుడి రికార్డుగా ఉంది. దాన్ని తాజాగా వాషింగ్టన్ సెందర్ సవరించాడు.

గాయంతో దూరమైన భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో సుందర్ ఎంపికైన సంగతి తెలిసిందే. అశ్విన్‌ లోటును భర్తీ చేసేందుకు సుందర్ ఎంపిక చేసింది పుణె. సుందర్‌ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌, కుడిచేతి స్పిన్ బౌలర్‌.  బంగ్లాలో జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్‌ జట్టులో సుందర్‌ కీలక ఆటగాడు. విజయ్‌హజారే, దేవధర ట్రోఫిల్లో తమిళనాడు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు.
 
అశ్విన్‌ స్థానానికి సుందర్‌ జమ్ముకశ్మీర్‌ ఆల్‌రౌండర్‌ పర్వేజ్‌ రసూల్‌తో పోటి పడ్డాడు. వీరిద్దరి మద్య పుణె జట్టు నెట్స్‌లో బౌలింగ్‌ పరీక్ష చేసింది. వీరిద్దరూ పుణె కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, మహేంద్ర సింగ్‌ ధోని, బెన్‌ స్ట్రోక్స్‌ లకు నెట్స్‌లో బౌలింగ్‌ చేశారు. అయితే సుందర్‌ కెప్టెన్‌ స్మిత్‌ వికెట్‌ పడగొట్టడంతో అవకాశం పొందాడు. వాషింగ్టన్ ఎంపికలో పుణె వ్యూహం ఫలించిందనే చెప్పాలి. కీలక మ్యాచ్ లో సాధారణ స్కోరును కాపాడుకుని పుణె విజయంలో సాధించడంలో సుందర్ పాత్ర వెలకట్టలేనిది. రోహిత్ శర్మ, అంబటి రాయుడు, పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లను తన స్పిన్ మ్యాజిక్ తో బోల్తా కొట్టించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు.

మరిన్ని వార్తలు