ఏసీబీ కనుసన్నల్లో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం

12 Jun, 2015 02:12 IST|Sakshi
ఏసీబీ కనుసన్నల్లో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం

* ఏపీ సీఎం చంద్రబాబు సహా మంత్రుల హాజరు
* మీడియాకు అనుమతి నిరాకరణ
* బెయిల్ గడువు ముగిసిన అనంతరం జైలుకు రేవంత్

 
 సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కోర్టు ఆదేశాల మేరకు గురువారం 12 గంటలపాటు బెయిల్‌పై బయటకు వచ్చి తన కుమార్తె నైమిషరెడ్డి నిశ్చితార్థంలో పాల్గొన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమం ఏసీబీ అధికారులు, పోలీసుల కనుసన్నల్లోనే జరిగింది. మీడియాను కార్యక్రమానికి హాజరు కానీయలేదు. కేవలం కెమెరాలను మాత్రమే కాసేపు అనుమతించి బయటకు పంపారు. ఉదయం 6 గంటలకు చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చిన రేవంత్... పోలీస్ ఎస్కార్ట్ అనుసరించగా పార్టీ నాయకులు, అభిమానుల కోలాహలం మధ్య జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం 8 గంటలకు భార్య గీత, కుమార్తెతో కలసి నిశ్చితార్థ వేదికకు చేరుకొని 10 గంటల వరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నిశ్చితార్థానికి హాజరైన అతిథులను పలకరిస్తూ గడిపారు. నిశ్చితార్థానికి హాజరైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతులు, లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ.. రేవంత్‌రెడ్డి దంపతులు, నిశ్చితార్థం జరుగుతున్న నైమిష, సత్యనారాయణరెడ్డిలతో ఆత్మీయంగా గడిపారు.
 
  తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ మంత్రులు దేవినేని ఉమ, పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేక్, గాంధీ, సండ్ర వెంకట వీరయ్య, బి.కె. పార్థసారథి, కాంగ్రెస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, దానం నాగేందర్, విష్ణువర్ధన్‌రెడ్డి, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, సినీనటి కవిత తదితరులు హాజరై రేవంత్ కుమార్తెను ఆశీర్వదించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేసిన రేవంత్... 3 గంటలకు తిరిగి నివాసానికి చేరుకున్నారు. గంటసేపు కుటుంబ సభ్యులతో గడిపిన రేవంత్‌రెడ్డి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బెయిల్ గడువు ఉండటంతో ఆలోపే తిరిగి చర్లపల్లి జైలుకు వెళ్లారు.

మరిన్ని వార్తలు