నామినేషన్ ఓకే | Sakshi
Sakshi News home page

నామినేషన్ ఓకే

Published Fri, Jun 12 2015 2:05 AM

R.K.Nagar by-election nominations  ok

ఆర్కేనగర్ అన్నాడీఎంకే అభ్యర్థి జయలలిత నామినేషన్ చెల్లదంటూ వచ్చిన అభ్యంతరాన్ని ఎన్నికల అధికారి     తోసి పుచ్చారు. జయ     నామినేషన్‌ను అంగీకరించినట్లు గురువారం పకటించారు.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆర్కేనగర్ ఉప ఎన్నికపై ఈనెల 10వ తేదీతో నామినేషన్లు పూర్తికాగా గురువారం స్క్రూటినీ నిర్వహించారు. స్క్రూటినీ జరుగుతున్న సమయంలో ఆర్కేనగర్ స్వతంత్య్ర అభ్యర్థి సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి తరపున ఆయన న్యాయవాది రమేష్ జయ నామినేషన్‌పై అభ్యంతరాన్ని లేవనెత్తాడు. 2011లో శ్రీరంగంలో పోటీచేసిన నాటికంటే ఆర్కేనగర్‌లో పోటీచేసే సమయానికి జయ ఆస్తులు విపరీతంగా పెరిగాయని, అంతేగాక ప్రస్తుతం ఆమె వాడుతున్న కారును ఆస్తుల్లో చూపలేదని తదితర తొమ్మిది అభ్యంతరాలను ఆయన లేవనెత్తాడు. అయితే జయ నామినేషన్‌ను అన్ని కోణాల్లో పరిశీలించిన తరువాతనే స్వీకరించామని ఎన్నికల అధికారి బదులిచ్చాడు.
 
 జయ నామినేషన్ అంగీకరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అలాగే, ట్రాఫిక్ రామస్వామి పిటిషన్‌పై కూడా కొందరు అభ్యంతరాలు లేవనెత్తారు. అయితే వాటిని సైతం ఎన్నికల అధికారి తిరస్కరిస్తూ రామస్వామి పిటిషన్‌ను ఆమోదించారు. సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ నామినేషన్ సైతం ఆమోదం పొందింది. గాంధేయవాది శశిపెరుమాళ్ నామినేషన్‌ను తిరస్కరించారు. నామినేషన్‌తోపాటు దాఖలు పరిచిన ఆస్తుల వివరాలు సరిగా లేని కారణంగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే మంత్రులు, నేతలు ఆర్కేనగర్‌లో గురువారం భారీస్థాయిలో ప్రచారం నిర్వహించారు. పలువురు మంత్రులతోపాటు  మంత్రి ఓ పన్నీర్‌సెల్వం గురవారం ప్రచారం చేపట్టారు.
 

Advertisement
Advertisement