‘బర్త్‌ డే విత్‌ ఎ ట్రీ’

19 Dec, 2018 08:19 IST|Sakshi
బర్త్‌ డే పార్కులో మొక్క నాటుతున్న వీసీ ప్రొఫెసర్‌ అప్పారావు (ఫైల్‌)

‘బర్త్‌ డే విత్‌ ఎ ట్రీ’ పేరుతో వినూత్న కార్యక్రమం

హెచ్‌సీయూ క్యాంపస్‌లో ఉద్యాన వనం అభివృద్ధి  

వీసీ నుంచి విద్యార్థుల వరకు çపర్యావరణ పరిరక్షకులే

ఇప్పటికే ఈ పార్కులో 300 మొక్కలు నాటారు

రాయదుర్గం: పుట్టిన రోజు అనగానే ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేయడం, కేక్‌ కట్‌ చేయడం దాన్ని అంతా కలిసి బర్త్‌ డే చేసుకొనే వ్యక్తి ముఖానికి కేకంతా పూయడం ఇదో ఫ్యాషన్‌ ట్రెండ్‌గా మారింది. కానీ అందుకు భిన్నంగా గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. బర్త్‌ డే రోజున ఒక మొక్కను నాటాలని నిర్ణయించారు. ‘షేర్‌ యువర్‌ బర్త్‌డే విత్‌ ఏ ట్రీ’ పేరిట నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు.  2016 జూలై 16న  క్యాంపస్‌లోని వైల్డ్‌లెన్స్‌ టీం
ఆధ్వర్యంలో బర్త్‌డే పార్కును ఏర్పాటు చేశారు. హెచ్‌సీయూలోని సౌత్‌ క్యాంపస్‌ ప్రాంతంలోని స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌సైన్సెస్‌ సమీపంలో 1000 గజాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ బర్త్‌డే పార్కును వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పొదిలె అప్పారావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఇప్పటి వరకు 300 మొక్కలను బర్త్‌ డే పార్కులో నాటడం విశేషం.

జీవితాంతంగుర్తుండిపోయేలా.. 
హెచ్‌సీయూ వైస్‌చాన్స్‌లర్‌ మొదలుకొని ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్‌టీచింగ్, ఉద్యోగ విరమణ చేసినవారు, విద్యార్థులు బర్త్‌డే పార్కులో మొక్కలు నాటడం ప్రారంభించడంతో దీనికి ప్రాధాన్యం పెరిగింది. పుట్టిన రోజున ఓ మొక్కను నాటడం సంప్రదాయంగా, జీవితంలో ఆకుపచ్చని తీపి జ్ఞాపకంగా మిగిలిపోయేలా అందరి మనసుల్లో నిలిచిపోతోంది. తమ పుట్టిన రోజున మొక్కను నాటి.. తీరిక దొరికనప్పుడల్లా వచ్చి దానిని చూసుకొని గొప్ప అనుభూతిని పొందుతుండడం విశేషం. ఇప్పటికే వీసీ ప్రొఫెసర్‌ పొదిలె అప్పారావు, వైల్డ్‌లెన్స్‌ బృందం నిర్వాహకుడు రవి జిల్లపల్లి, పరిశోధక విద్యార్థి మారుతి.. ఇలా చాలా మంది తమ బర్త్‌ డే సందర్భంగా మొక్కలు నాటారు.  

స్పందన భేష్‌..
బర్త్‌ డే రోజు మొక్కలు నాటే వినూత్న ఆలోచనకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 300 మొక్కలను నాటారు. ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్‌టీచింగ్‌ ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇందులో భాగస్వాములు కావడం అభినందనీయం.       – రవి జిల్లపల్లి, వైల్డ్‌లెన్స్‌ వ్యవస్థాపకుడు 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా