మన ఊరు.. విరాళాల జోరు

30 Sep, 2019 08:54 IST|Sakshi
ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు విరాళం చెక్కును అందిస్తున్న కలెక్టర్‌ హనుమంతరావు

నేడు దాతలకు సన్మానం 

రూ.కోటి అందజేసిన పరిశ్రమల యాజమాన్యాలు 

 నాలుగు రోజుల్లోనే రూ.3.31 కోట్లకు చేరిన సొమ్ము 

మీ సొంత ఊరికి మేలు చేయడానికి ఎంతో కొంత సహాయం, సహకారం అందించండి అంటూ కలెక్టర్‌ హనుమంతరావు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందనే వచ్చింది.. ‘మన ఊరు’ పేరుతో విరాళాలివ్వండి అంటూ కలెక్టర్‌ ఓ కార్యక్రమం చేపట్టగానే  ప్రజాప్రతినిధులు, అధికారులు, పరిశ్రమల యజమానులు భారీగానే విరాళాలందించారు. ఇప్పటికే రూ. 3 కోట్ల 31లక్షల పై చిలుకు నిధులు సమకూరాయి. ఈ క్రమంలో విరాళాలిచ్చిన దాతలను సోమవారం (నేడు) సన్మానించనున్నారు.     

సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రంలోనే భూవాణి, ప్రజావాణిలో అక్షయపాత్ర భోజనం, పల్లె నిద్ర, మెగా శ్రమదానం, మెగా హరితహారం.. తదితర కార్యక్రమాలను వినూత్నంగా ప్రవేశపెట్టిన కలెక్టర్‌ ఎం.హనుమంతరావు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే ‘మన ఊరు’.  ఆర్థికంగా స్థితిమంతులైన వారు తమ స్వగ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కొంత డబ్బును విరాళంగా ఇవ్వడం మన ఊరు ముఖ్య ఉద్దేశం. దాతల నుంచి విరాళాల సేకరించే అంశాన్ని కొత్తగా అమలులోకి తెచ్చిన పంచాయతీరాజ్‌ చట్టంలో పొందుపర్చడంతో కలెక్టర్‌ ఆ దిశగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. దాతలు విరాళంగా ఇచ్చిన నిధులను ఆయా గ్రామాల్లో అత్యవసర పనులకు ప్రాధాన్యతా క్రమంలో ఖర్చు చేయనున్నా రు. ముఖ్యంగా పాఠశాలల్లో మౌలిక వసతులు, గ్రామంలో పరిశుభ్రతకు చెత్త బుట్టల పంపిణీ, వీధి లైట్లు, యువజనులకు భవనాలు, హరితహారం.. తదితర కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వనున్నారు. మన ఊరు వినూత్న కార్యక్రమమని, దాతలు స్పందించాలని మంత్రి హరీశ్‌రావు సైతం అభినందించడం విశేషం.

గ్రామం నుంచి ఆర్థికంగా ఎదిగినవారితోనే.. 
జిల్లాలో మొత్తం 647 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాల నుంచి ఆర్థికంగా ఎంతో బలపడిన వారున్నారు. ఆయా గ్రామాల నుంచి విదేశాలకు వెళ్లినవారు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి సంపాదించినవారు, ఉద్యోగులు, తదితరులుంటారు. వారు ఎంతో కొంత తమ గ్రామానికి సహాయం చేయాలని తాపత్రయపడుతుంటారు. కానీ ఎవరి ద్వారా ఆ డబ్బులు ఖర్చు చేయాలి, ఏవిధంగా ఖర్చుచేయాలి, తదితర విషయాలు తెలియక వెనుకంజ వేస్తుంటారు. అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 30 రోజుల గ్రామాల కార్యాచరణ ప్రణాళికను వేదిక చేసుకోవాలని కలెక్టర్‌ హనుమంతరావు మన ఊరు కార్యక్రమం ద్వారా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామిక వేత్తల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఈనెల 30న జిల్లా వ్యాప్తంగా ‘డోనర్స్‌డే.. 
జిల్లా వ్యాప్తంగా డోనర్స్‌ డేను మొదటి విడతగా ఈ నెల 30న(నేడు) నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు దాతలకు ఆ రోజున గ్రామాల్లో సన్మానించడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. గ్రామసభలో ఆ రోజు ఆ గ్రామంలో ఎంతమంది దాతలు విరాళంగా ఇచ్చారో వారందరినీ గ్రామస్తుల ముందు సన్మానించాలని నిర్ణయించారు. ఆ గ్రామానికి విరాళంగా ఇచ్చినవారు ఆ రోజు గ్రామంలో లేకపోతే వారి తరఫున కుటుంబ సభ్యులు, బంధువులను సన్మానించనున్నారు. ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐలు అందుబాటులో ఉండరు కాబట్టి వారి కుటుంబీకులను సన్మానించాలని నిర్ణయించారు. అదే వి«ధంగా రెండో విడత డోనర్స్‌ డేను వచ్చే నెల 5న నిర్వహించనున్నారు. 
విశేష స్పందన: 
తమ స్వగ్రాల సర్వతోముఖాభివృద్ధికి దాతల నుంచి విరాళాల సేకరించేందుకు ఉద్దేశించిన మన ఊరు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. దీన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్‌ పిలుపుతో ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తల నుంచి స్పందన లభిస్తోంది.  

  • ఒక్క పటాన్‌ చెరు మండలంలోనే పలు పరిశ్రమల యజమానులు స్పందించి రూ. కోటి విరాళంగా అందజేశారు. ఈ నిధులను ఆయా గ్రామాల పరిధిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు. 
  • పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తాను దత్తత తీసుకున్న కొత్తపల్లి, నల్లవెల్లి గ్రామాలకు గాను రెండు ట్రాక్టర్లను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దీని కోసం మొదటి విడతగా రూ.9 లక్షల విరాళం ప్రకటించారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తానని తెలిపారు. 
  • ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి రూ.5లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులను అవసరమైన గ్రామాల్లో వినియోగించాలని కలెక్టర్‌కు సూచించారు.
  •  కలెక్టర్‌ హనుమంతరావు దత్తత తీసుకున్న కంది మండలంలోని చెర్లగూడెం గ్రామ అభివృద్ధికి తన వేతనంలో నుంచి రూ.25 వేల చెక్కును మంత్రి టి.హరీవ్‌రావుకు అందజేశారు. 
  • జిల్లాలోని పలువురు అధికారులంతా కలిసి రూ.5 లక్షలను ఆయా గ్రామాలకు విరాళంగా అందించారు. ఒక్కో అధికారి రూ. 5వేల నుంచి రూ.25 వేల వరకు స్వంత డబ్బులను అందజేశారు. 
  • జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల మంజుశ్రీ తాను దత్తత తీసుకున్న పుల్కల్‌ మండలంలోని పోచారం గ్రామ అభివృద్ధికి రూ.20వేలు మొదటి విడతగా విరాళం ఇచ్చారు. 
  • జిన్నారం మండలంలోని ఊట్ల గ్రామానికి జెడ్పీ వైస్‌చైర్మన్‌  కుంచాల ప్రభాకర్‌ అమెరికాలో ఉన్న తన కూతురు పేరుతో రూ. 16 వేలు విరాళం ఇచ్చారు. 
  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌  నరహరిరెడ్డి కంది మండలంలోని కాశీపూర్‌ గ్రామానికి రూ.25వేలు అందజేశారు.  

అధికారుల దాతృత్వం.. 
కలెక్టర్‌ తన దత్తత గ్రామ అభివృద్ధికి రూ.25వేలు విరాళంగా ఇచ్చిన స్ఫూర్తితో జిల్లా అధికారుల నుంచి విశేష స్పందన లభించింది. డీఆర్‌ఓ రాధికారమణి రూ.10వేలు, సంగారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్‌ 20వేలు, జహీరాబాద్‌ ఆర్డీఓ రమేష్‌బాబు రూ.15వేలు, నారాయణఖేడ్‌ ఆర్డీఓ అంబదాస్‌ రాజేశ్వర్‌ రూ.10వేలు, జెడ్పీ సీఈఓ రవి రూ.25వేలు, బీసీ సంక్షేమాధికారి కేశురాం రూ.25వేలు, జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు రూ.25వేలు, నీటిపారుదల శాఖ ఈఈ మధుసూదన్‌ రెడ్డి రూ.25వేలు, జిల్లా ల్యాండ్‌ సర్వే అధికారి మధుసూదన్‌ రావు రూ.21వేలు, ఇంటర్మీడియట్‌ విద్యాధికారి ఎం.కిషన్‌ రూ.15వేలు, పంచాయతీరాజ్‌ ఈఈ దామోదర్‌ రూ.15వేలు, లీగల్‌ మెట్రాలజీ అధికారి ప్రవీణ్‌కుమార్‌ రూ.15వేలు, మత్స్యశాఖ జిల్లా అధికారి సుజాత రూ.11వేలు, మైన్స్‌ అండ్‌ జియాలజీ అధికారి మధుకుమార్‌ రూ.10వేలు, జౌళి, చేనేత అధికారి విజయలక్ష్మి రూ.10వేలు, అసిస్టెంట్‌  కమిషనర్‌ రవీందర్‌ రూ.10వేలు, సీపీఓ పి.మనోహర్‌ రూ.10వేలు, డీఎంటీఎస్‌ఈ ఎస్‌సీఎల్‌ సుగుణ రూ.10వేలు, అందోల్‌ పీఆర్‌ ఈఈ వేణుమాధవ్‌ రూ.10వేలు, ఆర్‌ఎంఓ డాక్టర్‌.సంగారెడ్డి రూ.10వేలు, డీఈఓ విజయలక్ష్మి రూ.10వేలు, డీపీఓ వెంకటేశ్వర్లు రూ.10వేలు, పశుసంవర్ధకశాఖ అధికారి రామారావు రాథోడ్‌ రూ.10వేలు, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు రూ.10వేలు, జిల్లా ట్రెజరీ అధికారి వెంకటేశ్వర్లు రూ.10వేలు అందజేశారు.

అదే విధంగా రూ.5వేలు విరాళం ఇచ్చిన అధికారుల్లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌  ఈడీ బాబూరావు, ఆడిట్‌ అధికారి బలరాం, జిల్లా మహిళా సంక్షేమాధికారి పద్మావతి, ఎస్సీ డెవలప్‌మెంట్‌ అధికారి మల్లేశం, టీఎన్‌ఆర్‌ఈడీసీఎల్‌ మాణిక్యం,  జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి వందన, జిల్లా యువజన, క్రీడలు అధికారి రాంచందర్‌రావులు ఉన్నారు. ఇలా ఎంతోమంది దాతలు విరాళంగా ఇవ్వడంతో పటాన్‌ చెరు మండలంలో పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన రూ. కోటికి అదనంగా రెండు రోజుల్లోనే రూ.21,09,000 వచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.హనుమంతరావు ప్రకటించారు.  

సన్మానిస్తారిలా.. 
ఇచ్చిన డబ్బును బట్టి ఎవరిని ఎలా సన్మానించాలనే విషయమై జిల్లా యంత్రాంగా విధివిధానాలు రూపొందించింది. దాతలను మూడు విభాగాలుగా చేసి సన్మానించనున్నారు.రూ.లక్షలోపు విరాళం ఇస్తే గ్రామంలోనే గ్రామసభలో సన్మానిస్తారు ∙రూ.లక్ష నుంచి ఐదు లక్షలలోపు విరాళంగా ఇచ్చిన వారిని కలెక్టర్, ఎస్పీ, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్, తదితరుల సమక్షంలో కలెక్టరేట్‌లో సన్మానిస్తారు . రూ. 5 లక్షలకు పైబడి విరాళమిస్తే జిల్లా మంత్రిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించి ఆయన చేతులమీదుగా సన్మానించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హనుమంతరావు నిర్ణయించారు.  

దాతలు ముందుకు రావాలి
మన ఊరికి ఎంతో కొంత సేవచేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయినా నేరుగా చేసే అవకాశం అందరికీ రాదు. అందువల్లనే మీ స్వంత గ్రామాల అభివృద్ధికి మీరు చేయూతనివ్వడానికి అధికారికంగా విరాళాలు స్వీకరిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ, వచ్చే నెల 5వ తేదీన డోనర్స్‌డే గా నిర్వహిస్తున్నాం. విరాళాలు ఇచ్చిన వారిని సన్మానిస్తాం. గ్రామం నుంచి వెళ్లి విదేశాల్లో ఉన్నవారు, ఆర్థిక స్థితిమంతులు..ఇలా ఎవరైనా సరే మీ గ్రామాభివృద్ధికి తోడ్పడండి. విరివిగా విరాళాలు ఇవ్వడం ద్వారా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కండి. దాతలు ముందుకు రావాలి.  – హనుమంతరావు, కలెక్టర్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా