లాక్‌డౌన్‌ మంచిదే..

9 Apr, 2020 02:52 IST|Sakshi

దీనిని ఓ అవకాశం, అదృష్టంగా మార్చుకోండి 

నా 30 ఏళ్ల వైవాహిక జీవితంలో ఇదో అనుభూతి 

వారం రోజులుగా     నా సతీమణి పద్మతో ఉన్నది ఇప్పుడే 

‘సాక్షి’తో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ప్రజలు భారంగా భావించవద్దని.. అవకాశం, అదృష్టంగా మార్చుకుని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు లాక్‌డౌన్‌ను చిత్తశుద్ధితో పాటిస్తున్నారని, ఇదే స్ఫూర్తిని మరికొంత కాలం కొనసాగించాలన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తన వ్యక్తిగత జీవితంపై ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

అందరూ బాధ్యతగా మెలగాలి.. 
‘ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒక్క వైరస్‌ ప్రపం చాన్ని గడగడలాడిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా దీన్ని తట్టుకో లేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో భారతీయులుగా మనం బాధ్యతగా మెలగాలి. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దు.

ఇంత కంటే మంచి సమయం రాదు.. 
ఆధునిక కాలంలో ఎవరూ ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వాలే ఎవరినీ ఇంట్లోంచి బయటకు రావద్దంటున్నాయి. ఈ పరిస్థితిని మనం భారంగా తీసుకోవద్దు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇంత కన్నా మంచి సమయం మళ్లీ రాకపోవచ్చు. దీన్ని అవకాశంగా తీసుకోండి. నాకు పెళ్లయి ఏప్రిల్‌1తో 30 ఏళ్లు. ఫైటర్‌ పైలట్‌గా, రాష్ట్రపతి కార్యాలయంలో కీలక విధులు నిర్వర్తించిన అధికారిగా, రాజకీయ నాయకుడిగా 30 ఏళ్లుగా ప్రజాసేవలోనే ఉన్నాను. నా భార్యతో వరుసగా వా రం రోజులు ఇంట్లోనే గడిపిన సందర్భాలు ఈ ముప్పై ఏళ్లలో లేవు. ఇప్పుడది నెరవేరింది. కరోనా కారణంగా కుటుంబ సంబంధాలు బలపడుతున్నాయి. ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. లాక్‌డౌన్‌ సమయంలో పేదల కనీస అవసరాలు తీర్చాలి. అవసరాలు తీరితే రోడ్ల మీదకు రారు. అప్పుడు ప్రభుత్వాల లక్ష్యం నెరవేరుతుంది’. 

మరిన్ని వార్తలు