అనాసక్తతే సేద్యానికి సవాల్‌

20 Jan, 2017 02:35 IST|Sakshi

కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్‌ పంజాబ్‌ సింగ్‌
సాక్షి, హైదరాబాద్‌: భూతాపోన్నతి వల్ల వ్యవసాయం అతలాకుతలమవుతోందని, అయితే మన దేశంలో వ్యవసాయంపై పెరు గుతున్న అనాసక్తత భూతాపోన్నతి కన్నా పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి, జాతీయ వ్యవసాయ శాస్త్రాల సంస్థ(ఎన్‌.ఎ.ఎ.ఎస్‌.) అధ్యక్షుడు డాక్టర్‌ పంజాబ్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పర్యావరణ అనుకూల సాంకేతికతల ద్వారా వంట నూనెల ఉత్పత్తి పెంపుదల’ అనే అంశంపై గురువారం హైద రాబాద్‌ రాజేంద్రనగర్‌లో ప్రారంభమైన రెండు రోజుల శాస్త్రవేత్తల జాతీయ స్థాయి మేధోమథనంలో ఆయన మాట్లాడారు.

పంట దిగుబడులు పెంచినా గిట్టుబాటు ధర లభించని దుస్థితి వల్ల వ్యవసాయం నుంచి వీలైతే తప్పుకోవాలని 40% రైతులు భావి స్తున్నారన్నారు.  వ్యవసాయ పరిశోధనలకు నిధులు అతి తక్కువగా కేటాయిస్తున్నందున శాస్త్రవేత్తల్లోనూ అనాసక్తత నెలకొందన్నారు. నిల్వ సదుపాయాల్లేక రైతులు పొలం గట్లపైనే పంటను అమ్ము కుంటున్నారని, 30% పంట వృథా అవుతోందన్నారు.  

పత్తి పెరుగుతుందేమో: పార్థసారథి
అంచనాలకు అందని రీతిలో వాతావరణం అనూహ్యంగా మారిపోతుండడం పంటల ఉత్పత్తి పెంపుదలకు సవాలుగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి అన్నారు. ప్రభుత్వం రైతులకు నచ్చజెప్పి 5 లక్షల హెక్టార్ల బీటీ పత్తికి బదులు కంది సాగు చేయిస్తే, ఇప్పుడు దాని ధర పడి పోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వచ్చే ఏడాది మళ్లీ పత్తి వైపే ఆకర్షితులయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ సంచాలకుడు డాక్టర్‌ ఎ. విష్ణువర్థన్‌రెడ్డి,  సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ సిద్ధిఖీ, డాక్టర్‌ రంగారావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు