గురుకులాల్లో 16వేల మందికి ప్రవేశాలు

20 Mar, 2018 02:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 204 మైనారిటీ గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను 5 నుంచి 9వ తరగతుల్లో 16 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బి.షఫీయుల్లా వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 2018–19 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో కొత్త అడ్మిషన్లతో పాటు 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు గల విద్యార్థులు గురుకులాల్లో ప్రవేశాలకు అర్హులన్నారు.

ఆన్‌లైన్‌లో tmreis.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫొటో, ఆధార్‌తో ఏప్రిల్‌ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సీట్ల కంటే దరఖాస్తులు అధికంగా వస్తే ఏప్రిల్‌ 28న లక్కీ డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఏప్రిల్‌ 30 నుంచి మే 5 వరకు ఉంటుందన్నారు. జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. వివరాల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040–23437909ను సంప్రదించవచ్చన్నారు.  

మరిన్ని వార్తలు