ముసి 'మూసీ'గా

29 Jan, 2020 10:45 IST|Sakshi

బాపూఘాట్‌ నుంచి ప్రతాపసింగారంవరకు కొత్త హంగులు

రూ.5 వేల కోట్లతో 45 కిలోమీటర్ల మేర శుద్ధి

60 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి అభియాన్‌ రెడీ

కేంద్రానికి నివేదించేందుకు త్వరలో ఢిల్లీ వెళ్లనున్న అధికారులు

సాక్షి, సిటీబ్యూరో: జాతీయస్థాయిలో కాలుష్యకారక నదుల్లో.. నాలుగో స్థానంలో నిలిచిన మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు  ఉద్దేశించిన రెండో దశ పథకానికి  కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌
లభించింది. కేంద్ర జల శక్తి అభియాన్, ఎన్‌ఆర్‌సీడీ (జాతీయ నదీ పరిరక్షణ, అభివృద్ధి) పథకాల కింద.. 60 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సుమారు రూ. 5 వేల కోట్ల అంచనా వ్యయంతో జలమండలి, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రూపొందించిన మూసీ ప్రక్షాళన పథకాలకు త్వరలో మోక్షం లభించనుంది. మూసీ పరివాహక ప్రాంతంలో మురుగునీటిని ప్రక్షాళన చేసేందుకు పదికి పైగా సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. మరో మూడు ప్రాంతాల్లో రీసైక్లింగ్‌ యూనిట్లను ఏర్పాటుచేస్తారు. ఈ పనులకు సంబంధించి జలమండలి సిద్ధంచేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను త్వరలో ఢిల్లీ వెళ్లనున్న జలమండలి అధికారులు జలశక్తి అభియాన్‌ ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. 

మూసీకి తీరనున్న కష్టాలు..
పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, ఇతర నివాస ప్రాంతాల నుంచి వెలువడుతోన్న వ్యర్థాలతో మూసీనది మురికి కూపమైంది. నిత్యం నగరంలో 1400 మిలియన్‌ లీటర్ల మురుగు నీరు ఈనదిలో కలుస్తోంది. గతంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో మొదటిదశ ప్రక్షాళన పథకానికి శ్రీకారం చుట్టారు. నదీ పరివాహక ప్రాంతంలో మురుగు శుద్ధికి ఏడు ఎస్టీపీలను నిర్మించారు. తద్వారా వివిధ నాలాల నుంచి రోజువారీగా వెలువడుతున్న 700 మిలియన్‌ లీటర్ల మురుగును శుద్ధిచేసి నదిలోకి వదిలే ఏర్పాట్లుచేశారు. æప్రస్తుతం రెండోదశ ప్రక్షాళన పథకం కింద నిత్యం 700 మిలయన్‌ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేయనున్నారు. ఇందుకోసం రూ.5000 కోట్ల అంచనా వ్యయంతో 10 ప్రాంతాల్లో సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను నెలకొల్పనున్నారు. ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో రీసైక్లింగ్‌ యూనిట్లను ఏర్పాటుచేసి పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను పూర్తిస్థాయిలో శుద్ధిచేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు సంబంధించి సర్వే, డిజైనింగ్‌ను ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ పూర్తిచేసిందన్నారు. ప్రాజెక్టుకయ్యే వ్యయాన్ని ఎన్‌ఆర్‌సిడి పథకం కింద కేంద్రం మంజూరు చేస్తుందని వివరించారు. కేంద్రం 60 శాతం నిధులను దశలవారీగా విడుదల చేయనుందని తెలిపారు. మరో 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉందని పేర్కొన్నారు. 

ఇదీ ప్రాజెక్టు స్వరూపం..
పథకం: మూసీ ప్రక్షాళన రెండోదశ
అంచనా వ్యయం: సుమారు రూ.5,000 కోట్లు (ఎన్‌ఆర్‌సిడి పథకం కింద కేంద్ర ఆర్థిక సహాయం 60శాతం, 40 శాతం నిధులు రాష్ట్రం)
ఉద్దేశం: మూసీలో రోజువారీగా కలుస్తున్న 700 మిలియన్‌ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేయడం.
చేపట్టనున్న నిర్మాణాలు: మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున మొత్తం.. పది సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటుచేస్తారు.
ఎస్టీపీలు ఎక్కడెక్కడ: అంబర్‌పేట్‌(142ఎంఎల్‌డి), నాగోల్‌(140ఎంఎల్‌డి), నల్లచెరువు(80ఎంఎల్‌డి), హైదర్షాకోట్‌(30), అత్తాపూర్‌(70ఎంఎల్‌డి), మీరాలం(6ఎంఎల్‌డి), ఫతేనగర్‌(30ఎంఎల్‌డి), ఐడీపీఎల్‌ టౌన్‌షిప్‌(59ఎంఎల్‌డి), నాగారం(29ఎంఎల్‌డి), కుంట్లూర్‌–హయత్‌నగర్‌(24 ఎంఎల్‌డి)
రీసైక్లింగ్‌ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్‌ టౌన్‌షిప్, నాగారం– కాప్రా
ప్రత్యేకతలు: జీహెచ్‌ఎంసీ పరిధిలో మూసీ నది ఉత్తర,దక్షిణ ప్రాంతాల్లో 574.59 చదరపు కిలోమీటర్ల పరిధిలో నాలాలు,పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధిచేసి తిరిగి నదిలోకి వదలనున్నారు.తద్వారా మూసీనది కాలుష్య కాసారం కాకుండా నివారించనున్నారు. పరివాహక ప్రాంతాల్లో ఈ నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా మార్చనున్నారు.

మరిన్ని వార్తలు