పానీపూరి తిన్న 40 మంది చిన్నారులకు అస్వస్థత

26 May, 2020 10:44 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : పానీపూరి తిన్న40 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  సోమవారం సాయంత్రం పట్టణంలోని సుందరయ్య నగర్‌, ఖుర్షీద్‌ నగర్‌లలోకి గప్‌చూప్‌ బండి వచ్చింది.  దీంతో పలువురు పిల్లలు, పెద్దలు పానీపూరి తిన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అందులో చాలా మందికి కడపునొప్పితోపాటు వాంతులు, విరేచనాలు కావడం ప్రారంభమయింది. 

దీంతో వెంటనే వారిని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంఅండ్‌హెచ్‌వో రిమ్స్‌కు చేరుకుని వైద్య సేవలను పర్యవేక్షించారు. ఇందుకు సంబంధించి రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాం మాట్లాడుతూ.. పానీపూరి తినడం వల్లనే బాధితులు అస్వస్థతకు గురైనట్టుగా భావిస్తున్నామని తెలిపారు. వారికి పూర్తి స్థాయిలో టెస్ట్‌లు నిర్వహించనున్నట్టు చెప్పారు. పిల్లలను బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. 24 గంటల తర్వాత బాధితులను డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు