తడిసి ముద్దయింది!

16 Jul, 2018 02:46 IST|Sakshi

రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వర్షాలు

32 శాతం అధిక వర్షపాతం నమోదు

ఆదిలాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 71 శాతం అధికం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాలు పుంజుకోవడంతో గత వారం పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 32 శాతం అధిక వర్షం కురిసినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

జూన్‌ ఒకటో తేదీ నుంచి ఆదివారం వరకు ఈ నెలన్నర రోజుల్లో సాధారణంగా 240 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటికే 318 ఎంఎంలు నమోదైంది. ఆదిలాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఏకంగా 71 శాతం చొప్పున అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో 62 శాతం చొప్పున అధిక వర్షపాతం నమోదైంది. కొమురం భీం జిల్లాలో 56 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

మెదక్‌ జిల్లాలో మాత్రం 19 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం ఆ జిల్లా వాసుల్ని ఆందోళనకు గురిచేస్తుంది. రాష్ట్రంలో నైరుతి సీజన్‌ సాధారణ వర్షపాతం 755 ఎంఎంలు కాగా, ఈ సారి 97 శాతం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. ఆ ప్రకారం ఈ సారి 732 ఎంఎంలు కురిసే అవకాశముంది. అంటే సీజన్‌ సాధారణ వర్షపాతంలో దాదాపు సగం వరకు ఇప్పటికే రికార్డు కావడం గమనార్హం.

మరో రెండ్రోజులు వర్షాలు..  
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది

. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు.. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు వెల్లడించారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది.

పాల్వంచ, చండ్రుగొండల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అశ్వారావుపేటలో 8, ముల్కలపల్లి, భద్రాచలం, బూర్గుంపాడు, కొత్తగూడెంలలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. 

మరిన్ని వార్తలు