హైటెక్ నగరిలో లోటెక్ బడులు

16 Jun, 2015 03:41 IST|Sakshi
హైటెక్ నగరిలో లోటెక్ బడులు

- శిథిలావస్థలో తరగతి గదులు
- వే ధిస్తున్న తాగునీటి కొరత
- డంపింగ్ యార్డుల్లా పరిసరాలు
- విద్యార్థులకు తప్పని అవస్థలు
సాక్షి, సిటీబ్యూరో:
తలుపులు లేని తరగతి గదులు... పెచ్చులూడుతున్న పైకప్పులు.. డంపింగ్ యార్డుల కంటే దారుణమైన పరిసరాలు.. నిర్వహణ కొరవడిన మరుగుదొడ్లు... నేలమీదే పాఠాలు.. ఉపాధ్యాయులు, పిల్లలే అటెండర్లు... అలంకారప్రాయంగా బోర్లు... దొరకని మంచినీళ్లు... కనిపించని ప్రహరీలు.. ఇవీ మన సర్కారు బడులలోని సమస్యలకు సాక్ష్యాలు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని సోమవారం ‘సాక్షి’ పరిశీలిస్తే... అక్కడి పరిస్థితులు దుర్భరంగా కనిపించాయి.
 
కనిపించని వసతులు
హైదరాబాద్ జిల్లాలో 712, రంగారెడ్డి జిల్లాలో రెండు వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో చదువుకోవడమే శాపమేమో అన్నట్లుగా పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో అధికారుల పనితీరు  ఏ స్థాయిలో ఉందో ఈ పాఠశాలలే చెబుతాయి. వేసవి సెలవుల్లో పాఠశాలల్లో వసతులు కల్పించి ఆధునికీకరించాల్సి ఉండగా.. ఎక్కడా ఆ ఆచూకీ కానరాదు. గతేడాది 23 మరుగుదొడ్ల యూనిట్లు మంజూరుకాగా.. అందులో ఇప్పటికి ఒక్కటీ పూర్తి కాలేదు.

అసలు 9 యూనిట్ల నిర్మాణానికి స్థలాలే కరువయ్యాయి. మరో 14 నిర్మాణ దశలో ఉన్నాయి. దీనికితోడు 40 యూనిట్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఇదంతా పాఠశాలల పున ఃప్రారంభం నాటికే ముగియాలి. కానీ ఇంకా కొనసాగుతుండడం.. అధికారుల పనితీరుకు తార్కాణం. చాలా స్కూళ్లలో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు పేరుకుపోయి పాఠశాలల పరిసరాలు దుర్గంధభరితంగా తయారయ్యాయి. దీంతో ఇవి వినియోగానికి దూరమయ్యాయి. ఫలితంగా బాలికల కష్టాలు వర్ణణాతీతంగాా ఉన్నాయి.

వెంటాడుతున్న నీటి కష్టాలు
వందలాది బడుల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా చాంద్రాయణగుట్ట ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని స్కూళ్లకు నీటి కనెక్షన్ లేకపోవడం గమనార్హం. కొన్ని చోట్ల ఉన్నా నీరు రావడం లేదు. గత్యంతరం లేక పిల్లలు ఇంటి నుంచే నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. మరికొన్ని చోట్ల వాటర్ ఫిల్టర్లు ఉన్నా అలంకార ప్రాయంగా మారాయి. నీటి కొరత ప్రభావం మురుగుదొడ్ల నిర్వహణపై పడుతోంది.
 
ఇరుకు గదులు
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇరుకు గదుల్లోనే నెట్టుకొస్తున్నారు. ఏడాది క్రితం దాదాపు 60 అదనపు గదులు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపితే... సర్కారు పెడచెవిన పెట్టింది. చాలా ప్రాంతాల్లో గదుల పైకప్పు పెచ్చులూడుతున్నాయి. దీంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
 
‘చెత్త’గా పరిసరాలు...
చాలా పాఠశాలల పరిసరాలు డంపింగ్ యార్డుల్లా దర్శనమిస్తున్నాయి. వీధుల్లో చెత్తంతా తీసుకొచ్చి బడుల వద్దే పోగేస్తున్నారు. దీంతో అపరిశుభ్రత నెలకొంటోంది. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో.. రోగాలు ప్రబలే  ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల ప్రహరీలు కూలిపోగా... ఇంకొన్నింటికీ అసలే లేవు. దీంతో పాఠశాలలు అసాంఘిక కార్యక్రమాలకు నెలవవుతున్నాయి. తలుపులు, కిటికీలు సరిగా లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. దీనికితోడు నైట్ వాచ్‌మెన్ల కొరత తీవ్రంగా ఉంది. అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. అటెండర్ల పోస్టులు భర్తీ కాకపోవంతో ఆ బాధ్యతలను ఉపాధ్యాయులు, విద్యార్థులే నిర్వర్తిస్తున్నారు. పిల్లలే చీపుర్లు పట్టి గదులు, పరిసరాలు శుభ్రం చేసుకుంటున్నారు.
 
అక్కడే కల్లు కాంపౌండ్..

గౌలిపురా లలితాబాగ్ బ్రిడ్జి రోడ్డులోని శాలిబండ ప్రభుత్వ బాలికల పాఠశాల సమీపంలో కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం బడులు, ప్రార్థనా మందిరాల సమీపంలో కల్లు కాంపౌండ్ ఉండకూడదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ప్రహరీ ఎత్తు తక్కువగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు బడి అడ్డాగా మారింది.
 
ఉపాధ్యాయులకే అటెండర్ విధులు

లాలపేట్: లాలపేట్ ప్రభుత్వ పాఠశాలలో (గడి హైస్కూల్) కొన్నేళ్లుగా అటెండర్ పోస్టు ఖాళీగా ఉండటంతో ఉపాధ్యాయులే గంట కొడుతున్నారు. ఈ పాఠశాలలో 359 మంది విద్యార్థులుండగా 18 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. సాంఘికశాస్త్రం, సామాన్యశాస్త్రం టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లాలాపేట్ ప్రాంతంలో ఉన్న మరో మూడు పాఠశాలల పరిస్థితీ ఇలాగే ఉంది. కొన్ని పాఠశాలలను విద్యార్థులే  శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు