దేవునిగుట్టపై ‘గ్రానైట్‌’ కన్ను 

29 Aug, 2019 10:52 IST|Sakshi
అంబాల్‌పూర్‌ దేవుడి గుట్ట, శ్మశానవాటిక స్థలం కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో తవ్వకాలు 

సాక్షి, శంకరపట్నం(కరీంనగర్‌) : గ్రానైట్‌ వ్యాపారుల కన్ను దేవునిగుట్టపై పడింది. శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌ గ్రామంలో సర్వేనంబర్‌221లో 36 ఎకారాల్లో దేవుని గుట్ట, పేదలకు పట్టాలకు ఇచ్చిన స్థలం కూడా ఉంది. ఈ సర్వే నంబర్‌లో తవ్వకాలకు గ్రానైట్‌ వ్యాపారులు 2006లో 3హెక్టార్లలో అనుమతి పొందారు. కలర్‌ గ్రానైట్‌ రాయికోసం తవ్వకాలు చేపట్టారు. గుట్టచుట్టూ అసైన్డ్‌భూములు ఉన్నాయి. అంబాల్‌పూర్‌ గ్రామానికి చెందిన సముద్రాల కొంరయ్యకు 15 గుంటలు, సముద్రాల ఎల్లయ్యకు 15గుంటలు, దామెర చిలుకమ్మకు 25 గుంటలు, సముద్రాల కొంరయ్యకు 15 గుంటలు, దామెర రాజేశ్వరికి 15 గుంటలకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు.

వీరి నుంచి లీజ్‌కు తీసుకున్న వ్యాపారులు షెడ్లు వేసి నిర్మించుకున్నారు. దేవునిగుట్టపై కలర్‌గ్రానైట్‌ రాయి వెలికితీయడంతో మార్కెట్‌లో డిమాండ్‌ ఉండగా అదనంగా అను మతి కోసం  వ్యాపారులు దరఖాస్తులు చేసుకున్నారు. పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రం జారీ కాకపోవడంతో అనుమతి ఇంకా రాలేదు. ఈ క్రమంలో గుట్టపై పనులు చేస్తూ అసైన్డ్‌భూముల్లో వృథాగా క్వారీలో నుంచి వెలికితీసిన రాయిని కుప్పలుగా పోస్తున్నారు. పట్టాభూముల్లో మాత్రమే వృథా రాయిని పోయాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూమిలో రాయి పోస్తే అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి.  

రూ.లక్షల విలువ చేసే బ్లాకులు 
గ్రానైట్‌ క్వారీలో రూ.లక్షలు విలువ చేసే బ్లాకు లు గుట్టపై నిల్వ చేశారు. అనుమతి కంటే ఎక్కు వ విస్తీర్ణంలో గుట్టపై పనులు చేసి బ్లాకులు తీశారని ఆరోపణలు ఉన్నాయి. కలర్‌ గ్రానైట్‌కు డిమాండ్‌ ఉండడంతో అదనంగా అనుమతికోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అనుమతి విషయంలో స్పష్టత లేకపోవడంతో ఈనెల20న మైనింగ్, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ఈ నివేదిక ఆధారంగా గ్రానైట్‌క్వారీ ఎంత విస్తీర్ణంలో చేశారో తేలనుంది. 

పదిరోజులు గడుస్తున్నా ఇవ్వని నివేదిక  
అనుమతి కంటే ఎక్కువ విస్తీర్ణంలో గ్రానైట్‌క్వారీలో పనులు చేశారని అంబాల్‌పూర్‌ మాజీ సర్పంచ్‌ గాజుల లచ్చమ్మ, మాజీ ఉపసర్పంచ్‌ గాజుల మల్లయ్య, మోరె గణేశ్‌ ఫిర్యాదు మేరకు మైనింగ్‌ అధికారి సైదులు, సర్వేయర్‌ వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వేయర్‌ సంపత్‌లు ఈనెల20న సర్వేచేశారు. అదేరోజు పంచనామా కాపీ అందించాలి. సర్వే చేసి పది రోజులు గడిచినా నివేదికను అందించకపోవడంపై సర్వత్రా విమర్శలకు దారి తీసింది. 

చర్యలు తీసుకోవాలి 
శ్మశాన వాటికకోసం ఎంపిక చేసిన భూమిలో క్వారీ యజమానులు బండరాళ్లు వేసిండ్రు. గుట్టపై అనుమతి కంటే ఎక్కువ విస్తీర్ణంలో పనులు చేసిండ్రని ఫిర్యాదు చేస్తే సర్వే చేసిన అధికారులు నివేదికను ఇవ్వమంటే కాలయాపన చేస్తున్నరు.  ఎక్కువ స్థలంలో పనులు చేసిన దానిపై చర్యలు తీసుకోవాలి. 
– గాజుల మల్లయ్య,  మాజీ ఉపసర్పంచ్‌  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా