ఎస్సీ వర్గీకరణ: ప్రధాని వద్దకు అఖిలపక్షం

3 Feb, 2017 18:31 IST|Sakshi
ఎస్సీ వర్గీకరణ: ప్రధాని వద్దకు అఖిలపక్షం
ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం తక్షణం చేపట్టాలని కోరుతూ అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ఈనెల 6వ తేదీన ఆయన ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేశామని, వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి కేంద్రాన్ని కూడా ఈ విషయమై వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా కోరాలని కేసీఆర్ నిర్ణయించారు. 
 
ప్రధాని అపాయింట్‌మెంట్ దొరకడంతో..  కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, ఎంఐఎం నేతలకు ఆయన లేఖలు రాశారు. ఈనెల ఐదో తేదీకల్లా ఆయా పార్టీల నాయకులు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆ లేఖలో కోరారు. ఐదో తేదీన ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్.. అక్కడ విస్తృతంగా పలువురితో భేటీ అవుతారు. కాగా ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఆయన ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకుని మరీ అందరినీ తీసుకెళ్తున్నారు. ప్రధానితో సమావేశమైనప్పుడు.. అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మానం కాపీని కూడా ఆయనకు ఇవ్వాలని నిర్ణయించారు.