సీఎం కేసీఆర్‌ ఆలయాల సందర్శన

11 May, 2019 01:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడు రాష్ట్ర పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం రామేశ్వరంలోని ప్రసిద్ధ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గురువారమే రామేశ్వరం వెళ్లిన కేసీఆర్‌ అక్కడ మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమాధి వద్ద అంజలి ఘటించారు. తర్వాత అక్కడే బస చేసిన సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో కలసి రామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వేద పండితులు స్వామివారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కుటుంబసభ్యులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే రామసేతు, పంచముఖ హనుమాన్‌లను కూడా దర్శించుకున్నారు.

అలాగే ధనుష్కోటి బీచ్‌ను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు ఇక్కడి నుంచే రామసేతు నిర్మాణం మొదలుపెట్టాడని చెబుతారు. దీనినే ప్రస్తుతం అడమ్స్‌ బ్రిడ్జిగా పిలుస్తున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు, కుటుంబసభ్యులు తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు, సిబ్బంది వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ సముదాయంలోని రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలను, అక్కడి శిల్ప, చిత్రకళను కేసీఆర్‌ తిలకించారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా