నేపాల్‌లో మనోళ్ల అవస్థ

1 Jun, 2016 11:34 IST|Sakshi

 సాక్షిప్రతినిధి, ఖమ్మం: నేపాల్ యాత్రకు వెళ్లిన జిల్లా యాత్రికులను ట్రావెల్ ఏజెన్సీ వారు మధ్యలోనే వదిలేయడంతో అక్కడ అవస్థ పడుతున్నారు. పది రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మానస సరోవర యాత్రకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారితో కలిసి ఖమ్మం గాంధీనగర్‌కు చెందిన వెంపటి సత్యనారాయణ, శ్రీదేవి, చంద్రశేఖర్, రాణి, మధు, శ్రీరామ్‌మూర్తిలతోపాటు మరికొందరు బయల్దేరారు.

వీరంతా నేపాల్‌లో స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించిన తర్వాత..సోమవారం ట్రావెల్ ఏజెన్సీ బాధ్యులు వీరిని నేపాల్‌గంజ్‌కు తీసుకొచ్చి చెప్పాపెట్టకుండా ఉడాయించడంతో యాత్రికులు అక్కడే చిక్కుకున్నారు. తమ బంధువులకు ఫోన్లు చేసి జరిగిన విషయం తెలిపి, ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారితో మాట్లాడి సురక్షితంగా జిల్లాకు చేరుకునేలా చూడాలని కోరారు. ప్రభుత్వ ప్రతినిధి మంగళవారం నేపాల్ ఎంబసీతో మాట్లాడి..యాత్రికులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు.
 
 

మరిన్ని వార్తలు