‘ఆస్తిపన్ను పెంచకున్నా ఆదాయం పెరిగింది’

25 Jul, 2018 14:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను పెంచకున్నా ఆదాయం పెరిగిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  ఆస్తిపన్ను ద్వారా వచ్చే ఆదాయం 750 కోట్ల నుంచి 1450 కోట్ల రూపాయలకు చేర్చామన్నారు. తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను కేటీఆర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్‌ శాఖ ఎంత గొప్పగా పనిచేసినప్పటికీ ఎవరు మెచ్చుకోరని అన్నారు. క్షేత్ర స్థాయిలోని ప్రజల నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం వరకు సంబంధం ఉన్న సంస్థ తమదని పేర్కొన్నారు. తెలంగాణ జీఎస్‌డీపీలో 50 శాతం హైదరాబాద్‌ నుంచే వస్తోందని.. జన సాంద్రత పెరిగినప్పుడు మౌళిక వసతులు కల్పించడంలో ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఆగస్టులో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

తెలంగాణలో 74 అర్బన్‌ లోకల్‌ బాడీలు ఉన్నాయని.. అవి రానున్న కొద్ది రోజుల్లో 146 కానున్నాయని ప్రకటించారు. అలాగే తొమ్మిది అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో రోడ్ల కోసం హెచ్‌ఆర్‌డీసీ, మూసీ నది ప్రక్షాళన కోసం మూసి డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బాండ్లను సేకరించడం ద్వారా జీహెచ్‌ఎంసీ నూతన అధ్యయానికి శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. కొల్లూరులో అతి పెద్ద డబుల్‌ బెడ్రూం ఇళ్ల టౌన్‌ షిప్‌ను నిర్మిస్తున్నామని.. దీన్ని అందరు గుర్తించాలని కోరారు. కేంద్ర రక్షణ శాఖ సహకారం లేకపోవడం వల్ల రెండు పెద్ద స్కైవేలు ఆగిపోయాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు