ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతాం

12 Jun, 2020 04:05 IST|Sakshi

కరోనా సంక్షోభంలోనూ అవకాశాలు వెతుకుతున్నాం: కేటీఆర్‌

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం

అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలి  

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ మూలంగా దెబ్బతిన్న వివిధ రంగాలకు అండగా నిలిచి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెడతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ లైఫ్‌ సైన్సెస్‌ వంటి అత్యవసర సేవల పరిశ్రమలకు మినహాయింపును ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఫిక్కీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. ‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం– పునరుత్తేజం’ అనే అంశంపై కేటీఆర్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని రకాల పరిశ్రమలకు అండగా నిలుస్తూ కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వాటి కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని, కరోనాపై పోరుకు ప్రజలు సహకరించాలన్నారు.

ఎంఎస్‌ఎంఈలకు అండగా ఉంటాం
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు బ్యాంకర్ల సమావేశం నిర్వహించిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు విద్యుత్‌ బిల్లులు, ఆస్తిపన్ను విషయంలో పలు వెసులుబాట్లు కల్పించామన్నారు. సంక్షోభ సమయంలోనూ అవకాశాలను వెతకడంతో పాటు, చైనా నుంచి వెనక్కి మళ్లుతున్న విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ఆరోగ్యం, వైద్య ఉపకరణాల రంగంలో తెలంగాణ ఇప్పటికే ముందంజలో ఉందన్నారు. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం మరింత సాయం అందించాలని కేటీఆర్‌ కోరారు. 

మరిన్ని వార్తలు