మోదీ ప్రభుత్వం పేదల పక్షమా.. కార్పొరేట్ పక్షమా?

27 Dec, 2014 01:07 IST|Sakshi
మోదీ ప్రభుత్వం పేదల పక్షమా.. కార్పొరేట్ పక్షమా?

ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య

ఖానాపూర్ : కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పేదల పక్షమా.. ప్రైవేటు, కార్పొరేటు, పారిశ్రామిక రంగాల పక్షమా తేల్చి చెప్పాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2005లో ప్రారంభంమైన ఉపాధి హామీ పథకం 2008 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతోందని అన్నారు.

పథకంలో పలు లోపాలున్నా, పేదలందరికీ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. ఈ చట్టాన్ని ఎత్తివేయాలని భూస్వాములు, కార్పొరేటు శక్తులు, పెట్టుబడిదారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల  సమయంలో ప్రజలకు మంచి రోజులు తెస్తాం అని ప్రచారం చేసిన మోదీ, ఇప్పుడు క్రమేణా రెక్కాడితే కాని డొక్కాడని పేదల కడుపు కొట్టేలా ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏకకాలంలో రద్దు చేస్తే తిరుగుబాట్లు వస్తాయని, వివిధ సాకులతో దశలవారీగా ఎత్తివేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే జిల్లాలోని 52 మండలాలకు గాను కేవలం 10 మండలాలు మినహా 42 మండలాలకు ఉపాధి పనులు ఎత్తివేస్తున్నారని పేర్నొన్నారు.
 
29న కూలీలతో ఆందోళన
ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేయాలని యోచించడాన్ని నిరసిస్తూ ఈ నెల 29న ఉపాధిహామీ కూలీలతో కలిసి స్థానిక ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు నంది రామయ్య తెలిపారు. ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.

మరిన్ని వార్తలు