ప్రభుత్వ ఆస్పత్రులు ప్రవేటుకు..

3 Jan, 2020 03:14 IST|Sakshi

పీపీపీ పద్ధతిలో అనుసంధానించాలని నీతి ఆయోగ్‌ సూచన

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు మెడికల్‌ కాలేజీలతో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను అనుసంధానించాలని, తద్వారా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో వాటిని నిర్వహించాలని నీతి ఆయోగ్‌ సూచించింది. ఈ మేరకు ప్రజాభిప్రాయం కోరింది. ప్రైవేటు మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలంటే, దానికి అనుబంధ ఆసుపత్రిని నెలకొల్పడం అత్యంత కష్టమైన వ్యవహారం. ఎంతో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పైగా రోగులను ఆయా ప్రైవేటు బోధనాసుపత్రులకు తీసుకురావడం సమస్యగా మారింది.

ఈ నేపథ్యంలో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య నాసిరకంగా ఉంటుందన్న భావన అందరిలోనూ నెలకొంది. ఈ పరిస్థితుల నుంచి ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు విముక్తి కలిగించే నూతన ప్రతిపాదనను నీతి ఆయోగ్‌ ముందుకు తెచ్చింది. ప్రస్తుతం గుజరాత్, కర్ణాటకల్లో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను అప్పగించిన విషయాన్ని నీతి ఆయోగ్‌ ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసే విషయాన్ని చర్చకు తీసుకువచ్చింది.

వైద్యుల కొరతను తీర్చేందుకేనంటూ... 
అర్హత కలిగిన వైద్యుల కొరతను తీర్చడమే పీపీపీ పద్ధతి లక్ష్యమని నీతి ఆయోగ్‌ తెలిపింది. ఒక ప్రైవేటు మెడికల్‌ కాలేజీ పెట్టాలంటే దానికి అనుబంధంగా 600 పడకలతో బోధనాసుపత్రి ఏర్పా టు చేయడం ఖర్చుతో కూడుకున్నది. దీంతో అనేకమంది ఔత్సాహికులు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో మెడికల్‌ సీట్ల కొరత వేధిస్తుందనేది నీతి ఆయోగ్‌ ఉద్దేశమని వైద్య నిపుణులు అంటున్నారు. తెలంగాణలో అదనంగా ఎంబీబీఎస్‌ సీట్లు అవసరంలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు