‘ముందస్తు’ తొలకరి!

1 Jun, 2018 00:28 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు

పటాన్‌చెరులో 5.3 సెం.మీ. వర్షం

వారంలో నైరుతి: వాతావరణశాఖ

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: కొద్ది రోజులుగా మండే ఎండలతో భగభగలాడుతున్న రాష్ట్రం గురువారం కాస్త చల్లబడింది. సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు కురిసి మురిపించాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో మధ్యాహ్నం దాకా 40 డిగ్రీల ఎండతో ఉక్కిరిబిక్కిరైన జనం సాయంత్రం కురిసిన వర్షంతో సాంత్వన పొందారు. క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడిందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ పేర్కొంది.

పటాన్‌చెరులో అత్యధికంగా 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచి ట్రాఫిక్‌ స్తంభించింది. బీహెచ్‌ఈఎల్, ఎల్బీనగర్, బేగంపేట్, గాజులరామారం, బంజారాహిల్స్, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో అర సెంటీమీటరు వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

నైరుతి రుతుపవనాలు మరో వారం రోజుల్లో గ్రేటర్‌ను పలకరించవచ్చని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదగిరిగుట్ట, భువనగిరి తదితర చోట్ల గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. నాగార్జునసాగర్‌ పరిధిలోని ఎత్తిపోతలలో ఈదురుగాలులకు 12కు పైగా భారీ వృక్షాలు కూలిపోయాయి. కరెంటు వైర్లు తెగి సరఫరా నిలిచిపోయింది. డ్యాం దిగువన కృష్ణానది బ్రిడ్జిపై జ్యూస్‌ అమ్ముకునే దుగ్యాల అంజయ్య (35) పిడుగుపాటుకు మృతిచెందాడు.

సంగారెడ్డి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జహీరాబాద్, న్యాల్‌కల్, కోహిర్, పుల్‌కల్, మొగుడంపల్లిల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. పిడుగుపాట్లకు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. పలుచోట్ల ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. మామిడికాయలు రాలిపోయాయి. పంటలకు నష్టం వాటిల్లింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ దేవరకద్ర, బాలానగర్, మిడ్జిల్‌ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

మరిన్ని వార్తలు