తొలివారంలో ‘పంచాయతీ’ నోటిఫికేషన్‌

26 Dec, 2018 02:12 IST|Sakshi

ఈనెల 29లోపు ఈసీకి రిజర్వేషన్‌ వివరాలు

ఒకటి రెండ్రోజుల్లో గ్రామస్థాయిలో రిజర్వేషన్లు 

వేగం పుంజుకున్న అధికార ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్‌: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ కసరత్తు ఊపందుకోవడంతో ఎన్నికల కమిషన్‌ జనవరి తొలివారంలోనే నోటిఫికేషన్‌ను వెలువరించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్లు, అన్‌రిజర్వుడ్‌ స్థానాలు ఖరారైన నేపథ్యంలో జిల్లా, మండల స్థాయిలో సర్పంచ్, వార్డు స్థానాల్లో రిజర్వేషన్లు నిగ్గుతేల్చే ప్రక్రియ కూడా వేగం పుంజుకుంది. ఒకటి రెండ్రోజుల్లోనే జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు ఈ జాబితాను సిద్ధం చేసి పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ కార్యాలయానికి సమర్పించేలా చర్యలు చేపట్టారు. రెండ్రోజుల్లోనే గ్రామస్థాయిల్లో రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

గ్రామస్థాయిల్లో సర్పంచ్, వార్డుల కేటాయింపు ముగిశాక జిల్లాల వారీగా ఈమేరకు గెజిట్‌లు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ఈ వివరాలను రెండుమూడ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 29లోపు పంచాయతీ రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించనుంది. దీన్నిబట్టి జనవరి మూడు లేదా నాలుగు తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. సోమవారం ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని జనాభా పరంగా కేటాయించిన రిజర్వేషన్లలో కొన్ని అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో నల్లగొండ జిల్లా 844 స్థానాలతో తొలిస్థానంలో, మహబూబ్‌నగర్‌ జిల్లా 721 పంచాయతీలతో రెండో స్థానంలో, సంగారెడ్డి జిల్లా 647 స్థానాలతో మూడో స్థానంలో ఉన్నాయి.

నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియాల్లో...
మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధికంగా బీసీలకు 170 సర్పంచ్‌ స్థానాలు, నల్లగొండ జిల్లాలో అత్యధికంగా అన్‌రిజర్వుడ్‌కు(జనరల్‌ కేటగిరీ) 370 స్థానాలు, ఎస్సీలకు 136 స్థానాలు, ఎస్టీలకు అత్యధికంగా ఎస్టీలకు 69 సర్పంచ్‌ స్థానాలు రిజర్వ్‌ అయ్యాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు రిజర్వ్‌ చేసిన పంచాయతీలే లేకపోవడం గమనార్హం. ఈ జిల్లాలో మొత్తం 479 పంచాయతీలు ఉన్నాయి. 25 మినహా అన్నీ షెడ్యూల్డ్‌ ఏరియాల్లోనే ఉండటంతో ఇతర ప్రాంతాల్లో అన్‌రిజర్వుడ్‌కు 11, ఎస్టీలకు 9, ఎస్సీలకు 5 స్థానాలు రిజర్వ్‌ చేశారు. దీంతో బీసీలకు ఒక్కటీ రిజర్వ్‌ కాలేదు.

మహిళా రిజర్వేషన్లు అత్యధికంగా ఉన్న జిల్లాలు
- బీసీ కేటగిరీలో మహబూబ్‌నగర్‌ జిల్లా–85, నల్లగొండ–82, సిద్ధిపేట–72, సంగారెడ్డి–69, కామారెడ్డిజిల్లా–66 స్థానాలు రిజర్వ్‌ అయ్యాయి. 
ఎస్సీ కేటగిరీలో నల్లగొండ జిల్లా–68, సంగారెడ్డి–64, ఖమ్మం–60, రంగారెడ్డి–55, మహబూబ్‌నగర్‌జిల్లాలో–53 సర్పంచ్‌ స్థానాలు రిజర్వ్‌ చేశారు.
ఎస్టీ కేటగిరీలో నల్లగొండ జిల్లా–34, ఖమ్మం–29, మహబూబాబాద్‌–25, సూర్యాపేట–25, నిర్మల్‌జిల్లాలో–18 స్థానాలు మహిళలకు కేటాయించారు.

మరిన్ని వార్తలు