స్వేచ్ఛగా మాట్లాడటం నేడు ఒక పరీక్ష

6 Aug, 2018 02:17 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న సాక్షి ఈడీ రామచంద్ర మూర్తి. చిత్రంలో పాశం, కె.శ్రీనివాస్, వెల్చాల

‘సాక్షి’ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి 

తెలంగాణలో కనిపించని నిర్బంధం ఉంది

సాక్షి, హైదరాబాద్‌ : నేడు సమాజంలో స్వేచ్ఛగా మాట్లాడటం ఒక పరీక్ష లాంటిదని సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి అన్నారు. ఆదివారం ఇక్కడి రవీంద్రభారతిలో తెలంగాణ ఎడ్యుకేషనల్, సోషల్, కల్చరల్‌ లిటరరీ సొసైటీ ఆధ్వర్యంలో సెక్టోరియల్‌ సెమినార్స్‌ ఆన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ తెలంగాణ గతం, వర్తమానం, భవిష్యత్‌ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన రామచంద్రమూర్తి మాట్లాడుతూ వాస్తవాలను సేకరించడం, వ్యాఖ్యలను ప్రచురించడానికే పరిమిత మైన పత్రికలు ప్రభుత్వాల నిఘాలో ఉన్న ట్లు తెలుస్తోందన్నారు. పత్రికలకు గతంలో ఉన్న స్వేచ్ఛ నేడు లేదన్న విషయం ప్రజలకూ తెలుసన్నారు. గతంలో ఇంతకంటే మంచిగా పరిశోధనాత్మక కథనాలు వచ్చేవన్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రొఫెసర్‌ కోదండరాం అధ్యక్షతన మీటింగ్‌ వార్తను పత్రికల్లో సింగిల్‌ కాలంలోనూ, మరుసటిరోజు మంత్రి హరీశ్‌రావు చేసిన ఖండనలను పతాక శీర్షికలోన్లూ వేశారని గుర్తు చేశారు. 

కాళేశ్వరంపై చర్చలేకపోవడం ఆశ్చర్యకరం... 
రూ.84 వేల కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ జరగకపోవడం ఆశ్చర్యంగా ఉందని రామచంద్రమూర్తి అన్నారు.  ఇండియన్‌ ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యుడు దేవులపల్లి అమర్‌ మాట్లాడుతూ సీఎం సమీక్ష సమావేశాలు, పర్యటనల సమాచారాన్ని సీఎం కార్యాలయంలో పని చేసోన్న బృందం పంపించే సమాచారాన్ని మాత్రమే ప్రచురించాలని, సొంతంగా ఎటువంటి అదనపు విషయాలను ప్రచురించవద్దనే సందేశాన్ని సైతం పంపడం బాధాకరమన్నారు. నేడు మీడియా సీఎం అధీనంలోకి వెళ్లడం బాధాకరమన్నారు. తెలంగాణలో ఇటీవల పని ఒత్తిడితో 250 మంది జర్నలిస్టులు చనిపోయారని, తెలంగాణలో విలేకరుల పరిస్థితి అనే అంశంపై నివేదిక తయారు చేసి త్వరలో దేశంలోని పార్లమెంట్‌ సభ్యులందరికీ అందజేస్తామని తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’సంపాదకుడు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల్లో వచ్చిన వార్తల కంటే సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలకే స్పందన ఎక్కువగా ఉందన్నారు. ఆయా అంశాలపై సీనియర్‌ జర్నలిస్టులు కె.శ్రీనివాస్‌రెడ్డి, ఉ మా సుధీర్, పాశం యాదగిరి, కారంచేడు గోపాలం, సుమనాస్పతిరెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ వెల్చాల కొండల్‌రావు, కన్వీనర్‌ సీహెచ్‌ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు