‘సర్వే’పై సవాలక్ష అనుమానాలు!

16 Aug, 2014 01:16 IST|Sakshi
‘సర్వే’పై సవాలక్ష అనుమానాలు!

 చర్చావేదిక
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19న చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేపై తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. పలు అనుమానాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఫిలింనగర్ ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా భవన్‌లో శుక్రవారం చర్చావేదికను నిర్వహించారు. స్థానిక ఇంటింటి సమగ్ర సర్వే క్లస్టర్ ఆఫీసర్లు మల్లెల గిరి, జయకృష్ణతో పాటు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ లక్ష్మీబాయి, ఫిలింనగర్ 18 బస్తీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మామిడి నర్సింగరావుతో పాటు 32 స్వయం సహాయక బృందాల అధ్యక్షురాళ్లు ఇందులో పాల్గొన్నారు. పలు అనుమానాలను వ్యక్తం చేయగా... వాటిని అధికారులు నివృత్తి చేశారు.
 
బంజారాహిల్స్: ఇంటింటి సర్వే నిమిత్తం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లు పూర్తి స్నేహభావంతో మెలుగుతూ వివరాలు నమోదు చేసుకోవడమే కాకుండా వారికి వచ్చే అపోహలు కూడా తొలగిస్తారని అధికారులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరూ అందుబాటులో లేకపోయినా వారికి సంక్షేమ పథకాలు అందవని అంటున్నారని ప్రజ్వల గ్రూప్ అధ్యక్షురాలు సాంబమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. యజమాని సరైన వివరాలు ఇస్తే చాలని క్లస్టర్ ఆఫీసర్ జయకృష్ణ వెల్లడించారు.

సర్వే చేసే ఎన్యూమరేటర్లు అణువనువూ సోదా చేస్తారని వదంతులు వినిపిస్తున్నాయని సరస్వతి మహిళా గ్రూప్ అధ్యక్షురాలు సుగుణ, మహాలక్ష్మి గ్రూప్ అధ్యక్షురాలు చంద్రమ్మ, గంగ గ్రూప్ అధ్యక్షురాలు పద్మమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి ఇళ్లు కట్టుకున్నామని రెక్కాడితో డొక్కాడని స్థితిలో ఉన్నామని ఈ పరిస్థితిలో తెల్లరేషన్ కార్డు కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నామని ధనలక్ష్మి గ్రూపు అధ్యక్షురాలు ధనలక్ష్మి, కనకదుర్గ గ్రూప్ అధ్యక్షురాలు పద్మ, తేజస్విని గ్రూప్ అధ్యక్షురాలు గోవిందమ్మ, జ్యోతి గ్రూపు అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ, కుందన గ్రూప్ అధ్యక్షురాలు కౌసల్య వాపోయారు.

తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఎన్నడూ లేని విధంగా ఈ సర్వే ఏంటంటూ పలువురు మహిళలు దుయ్యబట్టారు. బ్యాంకు ఖాతా నంబర్లు ఇస్తే ప్రమాదం కదా అని శ్రీ రాజరాజేశ్వరి గ్రూప్ అధ్యక్షురాలు రమ్య ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద వారిని వదిలేసి మాలాంటి వాళ్లను లక్ష్యంగా పెట్టుకుంటారా అని బీజేఆర్ నగర్ సమాఖ్య అధ్యక్షురాలు మల్లీశ్వరి, బసవతారకం నగర్ సమాఖ్య అధ్యక్షురాలు యాదీశ్వరి అన్నారు.
 
 బడుగులకు వేధింపులా?
 సర్వే రోజున కుటుంబంలో ఒకరు ఉంటే సరిపోతుందా అనే దానిపై స్పష్టత లేదు. ఈ సర్వే ఎందుకో తెలియడం లేదు. మా కార్డులు తొలగిస్తారని భయంగా ఉంది. బడుగులను వేధించకుండా బడాబాబులను లక్ష్యంగా పెట్టుకుంటే మంచిది.
 - ఆర్.విజయరత్నం, శ్రీ రాజరాజేశ్వరి మహిళా గ్రూపు
 
 ఆందోళన వద్దు
 ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కచ్చితమైన సమాచారం ప్రజల నుంచి స్వీకరించడానికే సర్వే జరుగుతున్నది. సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన బడ్జెట్ అంచనా వేయడానికి సర్వే చేస్తున్నాం.         
 - మల్లెల గిరి, సర్వే క్లస్టర్ అధికారి
 

మరిన్ని వార్తలు