స్కూలు బయట ఎవరిది బాధ్యత?

14 Aug, 2019 13:06 IST|Sakshi

నగరంలో తడ‘బడి’తున్న ట్రాఫిక్‌

2011లో స్కూల్‌ ట్రాఫిక్‌ కమాండోస్‌కు మంగళం

అమల్లోకి రాని ‘బడి వేళల మార్పు’

ప్రతిసారి చర్చిస్తున్నా ఫలితం శూన్యం

పట్టించుకోని ఆ మూడు ప్రభుత్వ విభాగాలు  

స్కూలు విద్యార్థుల భద్రతతో పాటు వారిలో నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవా దృక్పథం పెంచడానికి ఎస్‌టీసీ వ్యవస్థ ఉపకరిస్తుందని పలువురు ప్రశంసించారు. అయితే, 2011 జూన్‌లో ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌సీలో ఓ పిటిషన్‌ దాఖలైంది. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అమలు చేస్తున్న ఎస్‌టీసీ విధానం బడి పిల్లల్ని వెట్టి చాకిరీకి వినియోగించడం కిందికే వస్తుందని, దాన్నినిషేధించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. విచారించిన కమిషన్‌.. ఎస్‌టీసీ వ్యవస్థను రద్దు చేయాల్సిందిగా నగర ట్రాఫిక్‌ వింగ్‌ను ఆదేశించింది. దీనిపై పోలీసులు అప్పీల్‌ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం తీసుకుని ఎస్‌టీసీలుగా ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. ఇదిఆచరణ సాధ్యం కాకపోవడంతో 2012 నుంచి కమెండోలకు బ్రేక్‌ పడింది.ఈ సమస్య తీరి మళ్లీ వ్యవస్థ ప్రారంభం కావాలంటే ట్రాఫిక్, ఆర్టీఏ, విద్యాశాఖలు కలిసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బడిపిల్లల భద్రత కోసం వీరు చొరవ చూపితే వచ్చే ఏడాదికైనా అమలులోకి వచ్చే అవకాశం ఉంది.  

సాక్షి, సిటీబ్యూరో: భావి పౌరులు, దేశానికి వెన్నెముక అయిన బడి పిల్లల భద్రతకు నగర ట్రాఫిక్‌ విభాగం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. వీరిని తరలించే వాహనాలు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా ప్రత్యేకంగా స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తోంది. పాఠశాలలకు వెళ్లి మరీ రహదారి నిబంధనలపై అవగాహన కల్పిస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. అత్యంత కీలకమైన రెండు అంశాలపై మాత్రం అధికార గణం దృష్టి పెట్టట్లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. దాదాపు తొమ్మిదేళ్ల క్రితంబ్రేక్‌ పడిన ‘స్కూల్‌ ట్రాఫిక్‌ కమాండోస్‌’ (ఎస్‌టీసీ) వ్యవస్థ ఒకటైతే.. పాఠశాలల ప్రారంభ–ముగింపు వేళలు మార్చే ‘స్టాగరింగ్‌ ఆఫ్‌ స్కూల్‌ టైమింగ్స్‌’ రెండోది.రవీంద్రభారతి వేదికగా స్టాగరింగ్‌ విషయమై ఏళ్లుగా చర్చిస్తున్నా అమలు మాత్రం ఆమడ దూరంలో ఉంటోంది.  

బడి పిల్లల భద్రత అంటే స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు, ఆటోల్లో ఆరుగురే అనే భావనలో ఆర్టీఏ, ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఉన్నారు. మరోపక్క స్కూలు పరిసరాలు దాటితే విద్యార్థుల భద్రత తమది కాదన్నట్లు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. పాఠశాల ప్రారంభ–ముగింపు వేళల్లో రోడ్డు క్రాసింగ్, వాహనాలు ఎక్కిదిగేప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. దీంతో నగర ట్రాఫిక్‌ అధికారులు 11 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన విధానమే ‘స్కూల్‌ ట్రాఫిక్‌ కమెండో’ (ఎస్‌టీసీ) వ్యవస్థ. ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ విధానంలో అటు పిల్లల భద్రతతో పాటు వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందే
అవకాశం ఉందంటూ అప్పట్లో ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించారు. దాదాపు ఏడాది పాటు సాగిన ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చింది. అయితే, 2011లో నేషనల్‌ చైల్డ్‌ రైట్స్‌ కమిషనర్‌ (ఎన్‌సీఆర్‌సీ) ఎస్‌టీసీ విధానానికి బ్రేక్‌ వేసింది. దీంతో అప్పటి నుంచి వీరి ఎంపిక, శిక్షణ వంటి కార్యక్రమాలు ట్రాఫిక్‌ వింగ్‌ చేపట్టలేదు. పాఠశాల ప్రాంగణం, పరిసరాల్లో బడి పిల్లల భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ కోసం అమల్లోకి వచ్చిన ఎస్‌టీసీ విధానం అటకెక్కింది.  

ఎస్‌టీసీ వ్యవస్థ పనితీరు ఇలా..  
ప్రతి పాఠశాల నుంచి 8, 9 తరగతులకు చెందిన 24 మంది విద్యార్థులను యాజమాన్యం ఎంపిక చేసి ఆ జాబితాను ట్రాఫిక్‌ పోలీసులకు ఇచ్చేది. అలా మొత్తం 6,720 మందిని ఎంపిక చేసి వీరికి ఆ పాఠశాలలోనే ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రాథమిక శిక్షణ ఇచ్చేవారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌టీసీల నైపుణ్యాన్ని పరిశీలిస్తూ వారితో పరేడ్‌ నిర్వహించి ట్రాఫిక్‌ విభాగం అధికారులే స్వయంగా రిఫ్లెక్టివ్‌ జాకెట్, విజిల్‌ తదితర ఉపకరణాలను ఇచ్చేవారు. ఈ 24 మందిలో రోజుకు నలుగురు చొప్పున పాఠశాల ప్రారంభ, ముగింపు వేళల్లో స్కూల్‌ ప్రాంగణంతో పాటు ఎదురుగా ఉండే రోడ్ల మీద విధులు నిర్వర్తించేవారు. ఈ నలుగురికి వారానికి ఒకసారి మాత్రమే విధులు ఉండేవి. వీరికి స్థానిక ట్రాఫిక్‌ పోలీసులు, పాఠశాలకు చెందిన సెక్యూరిటీ గార్డులు సహకరించేవారు. ఫలితంగా ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండేది. రెండేళ్ల పాటు సాగిన ఈ విధానంలో చిన్న అపశృతి కూడా జరగలేదు.  

అమలుకాని ‘బడి వేళల మార్పు’
విద్యాసంస్థల ప్రారంభ–ముగింపు సమయాల్లో వెల్లువెత్తుతున్న రద్దీ, తలెత్తుతున్న ట్రాఫిక్‌ ఇక్కట్లకు, జరిగే ప్రమాదాలకు విరుగుడుగా ట్రాఫిక్‌ పోలీసులు ఒకప్పుడు ప్రారంభించిన ‘బడి వేళల మార్పు’ (స్కూల్‌ టైమింగ్స్‌ స్టాగరింగ్‌) విధానం దాదాపు ఎనిమిదేళ్ల క్రితం మూలనపడింది. 2010లో పాక్షికంగా అమలైన ఈ విధానాన్ని 2011లో పూర్తి స్థాయిలో అమలు చేశారు. సత్ఫలితాన్నించిన ఈ విధానాన్ని మరింత పటిష్టంగా, సమర్థమంతంగా అమలు చేయాలని భావించారు. అయితే, అప్పటి నుంచి ఇది ఇంకా నివేదికల స్థాయిలోనే కొట్టుమిట్టాడుతోంది. ఫలితంగా ‘వేళల మార్పు’ దాదాపు మరుగునపడిపోయింది.

ఎస్‌టీసీల విధులు ఇవీ..
పాఠశాల ప్రారంభానికి అరగంట ముందు వచ్చి, పూర్తయిన తర్వాత అవసరమైనంత సేపు ఉండి స్కూల్‌ ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించాలి.  
పాఠశాలకు సంబంధించిన సైకిళ్లు, మోటారు సైకిళ్ల పార్కింగ్‌కు నిర్దేశిస్తూ రోడ్లపై ట్రాఫిక్‌ అబ్‌స్ట్రక్షన్స్‌ లేకుండా చూడాలి.  
స్కూల్‌కు చెందిన లోయర్‌ క్లాస్‌ విద్యార్థులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా రోడ్డు దాటడంతో
సహకరించాలి.  
స్కూల్‌ వాహనాలు/ప్రైవేట్‌ వాహనాల్లో చిన్న పిల్లలు ఎక్కడానికి, రోడ్డు క్రాస్‌ చేయడానికి సహకరించాలి.  
పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చే వాహనాలు వారిని స్కూల్‌ లోపల దింపేలా చర్యలు తీసుకోవాలి.  
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్‌టీసీలతో పాటు
పాఠశాలలకు ప్రభుత్వం నుంచి రివార్డులు అందేలా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకోవాలని భావించారు.  

పెరుగుతున్న స్కూల్‌జోన్స్‌
నగరంలో ప్రస్తుతం స్కూల్‌ జోన్స్‌ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ట్రాఫిక్‌ అధికారుల అధ్యయనంలో తేలింది. పాఠశాలలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని స్కూల్‌ జోన్‌గా పరిగణిస్తారు. ఒకప్పుడు కేవలం గోపాలపురం, అబిడ్స్, బంజారాహిల్స్‌లే ఈ జాబితాలో ఉండేవి. ఇప్పుడు జూబ్లీహిల్స్, నారాయణగూడ, ఎస్సార్‌నగర్, మైత్రీవనం, బేగంపేట్, తిరుమలగిరి, ఆసిఫ్‌నగర్‌ వంటివి కూడా స్కూల్‌ జోన్స్‌గా మారాయి. ఏ ఏటికేడాది కొత్త పాఠశాలలతో పాటు స్కూల్‌ జోన్స్‌ పుట్టుకువస్తున్నాయి. 2011లో గుర్తింపు పొందిన స్కూళ్ల సంఖ్య 3,035 ఉంటే ఆ సంఖ్య 2012 నాటికి 3,218కి చేరింది. అంటే ఏడాదికి 183 స్కూళ్లు పెరిగాయి. ఈ ఏడాది మొత్తం స్కూళ్ల సంఖ్య 3,500 దాటింది. రానున్న రోజుల్లో ప్రజల అవసరాన్ని బట్టి ఇవి పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్‌టీసీలను మరింత సమర్థంగా ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఎన్‌సీఆర్‌సీ ఉత్తర్వులతో నిలిచిపోయాయి.

‘కేటగిరీలూ’ రూపొందించారు
స్కూలు వేళల్లో మార్పును 2011లోనే ప్రయోగాత్మకంగా చేపట్టిన ట్రాఫిక్‌ విభాగం దానికి అవసరమైన ప్రాథమిక కసరత్తు కూడా చేసింది. స్కూల్‌ జోన్స్‌ను వివిధ కేటగిరీగా మార్చి జాబితాలు సైతం రూపొందించారు. విద్యా సంస్థల పనివేళల మార్పు కోసం నగర వ్యాప్తంగా అధ్యయనం చేసిన ట్రాఫిక్‌ వింగ్‌ కేటగిరీలుగా విభజించింది. ఈ సంఖ్య ఆధారంగా సంస్థల పనివేళల్లో కనీసం 15 నిమిషాల వ్యత్యాసం ఉండేలా చర్యలు తీసుకున్నారు. 500 నుంచి 750 మీటర్ల విస్తీర్ణంలో 8 కంటే ఎక్కువ స్కూల్స్‌ ఉంటే ‘ఏ’, ఈ విస్తీర్ణంలో 5 నుంచి 7 స్కూళ్ల మధ్య ఉంటే ‘బి’, 3 లేక 4 స్కూళ్లు ఉంటే ‘సి’ అంటూ గ్రేడింగ్‌ ఇచ్చిచ్చారు. ఈ ఏడాది దీన్ని సినిమా హాళ్లు, ప్రైవేటు కార్యాలయాలకు సైతం అమలు చేయాలని భావించినా ఆచరణలోకి రాలేదు. ఏటా రవీంద్రభారతి కేంద్రంగా జరిగే ‘బడిపిల్లల భద్రత’ సదస్సులో ఈ అంశంపై చర్చ జరుగుతున్నా చర్యలు మాత్రం ఉండట్లేదు.  

కమిటీలు ఏర్పాటైతేనే మేలు..
స్కూలు/కాలేజీల సమయాల్లో మార్పు విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ట్రాఫిక్‌ విభాగానికి లేదు. దీని కోసం తొలుత ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల వారీగా కొత్తగా ఏర్పడిన స్కూల్‌ జోన్లను గుర్తించాలి. డీఈఓ సహకారంతో డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, ట్రాఫిక్‌ ఏసీపీ, స్థానిక ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలి. వీరంతా ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యా సంస్థలు, ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేస్తారు. ఆపై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించి స్టాగరింగ్‌ విధానాన్ని రూపొందిస్తారు. వీటిని ఏర్పాటు చేయాలని గతంలో ట్రాఫిక్‌ వింగ్‌ ప్రయత్నాలు ప్రారంభించినా విద్యాశాఖ నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఫలితంగా విద్యాసంస్థల ప్రారంభ–ముగింపు వేళలు దాదాపు ఒకేలా ఉండటంతో విద్యార్థులను తరలించే, వ్యక్తిగత వాహనాల కారణంగా తీవ్రమైన రద్దీ ఉంటోంది. సమయం మించిపోకుండా గమ్యస్థానాలకు చేరే తొందరలో విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. 

మరిన్ని వార్తలు