కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు..?

19 Aug, 2019 10:11 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం : కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ ప్రాంత వాసుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడచెలక వద్ద సుమారు 1600 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం  అధ్యయనం చేసి వెళ్లింది. ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. అయితే ఇక్కడ భూసేకరణ ప్రధాన సమస్యగా ఉంది. అదేవిధంగా సమీపంలోనే అభయారణ్యం ఉండడంతో పర్యావరణ అనుమతులు సైతం తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా భూసేకరణ అంశం కీలకం కానుంది. పునుకుడచెలక వద్ద ఉన్న భూములు అత్యధికం ఆదివాసీలవే కావడం గమనార్హం. తమ భూములను ఇచ్చేది లేదని వారు చెబుతుండడంతో కొంత సందిగ్ధం నెలకొంది. ఏఏఐ బృందం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా స్థల సమస్య రావడంతో ఈ అంశం వెనక్కు వెళ్లింది. అయితే తాజాగా రాష్ట్రంలో ఈనెల 20 నుంచి  23 వరకు మరోసారి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో త్రిసభ్య బృందం పర్యటించనుంది.

రాష్ట్రంలో ఆరు చోట్ల ఎయిర్‌పోర్టులు నిర్మించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే బాధ్యతను ఏఏఐకు అప్పగించింది. దీంతో గతంలో ఏఏఐ బృందం కొత్తగూడెం, వరంగల్, మహబూబ్‌నగర్‌ ఏరియాల్లో పర్యటించి అధ్యయనం చేసింది. సంబంధిత నివేదికను ఆ బృందం ఉన్నతాధికారులకు అందజేసింది. ప్రస్తుతం రానున్న బృందం ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించనుంది. 20న ఢిల్లీ నుంచి నాగ్‌పూర్‌ రానున్నారు. 21న నాగ్‌పూర్‌ నుంచి నేరుగా ఆదిలాబాద్‌ వస్తారు. 22న నిజామాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 23న హైదరాబాద్‌ మీదుగా అవసరాన్ని బట్టి మరోసారి మహబూబ్‌నగర్‌లో పర్యటించి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ బృందంలో అమిత్‌కుమార్, నీరజ్‌గుప్తా, కుమార్‌ వైభవ్‌ ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా డైరక్టర్‌ డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు పర్యటన వివరాలు ప్రకటించారు.  

కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే మిలటరీ అవసరాలకు... 
కొత్తగూడెం విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేసుకుంటే బహుముఖ అవసరాలకు ఉపయోగపడుతుందనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనగా తెలుస్తోంది. ఇక కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు భూసేకరణ ప్రధాన సమస్య. ఇతరత్రా చూసుకుంటే అనుకూల అంశాలు ఉన్నాయి. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 200 కిలోమీటర్ల లోపు ఎయిర్‌పోర్టు నిర్మించకూడదనే ఒప్పందం ఉంది. అయితే కొత్తగూడెం శంషాబాద్‌ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో దీనికి ఆ సమస్య లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ విమానాశ్రయం కోసం అనేక ఏళ్లుగా డిమాండ్‌ ఉంది. అశ్వాపురం మండలంలోని హెవీవాటర్‌ ప్లాంట్‌ ఉద్యోగులు కొత్తగూడెం ఎయిర్‌పోర్టు సాధన కమిటీ సైతం వేసుకోవడం గమనార్హం. అదేవిధంగా జిల్లాలో మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో సింగరేణి, సారపాకలో ఐటీసీ, పాల్వంచలో ఎన్‌ఎండీసీ, నవభారత్‌ పరిశ్రమలు ఉన్నాయి.

ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎయిర్‌పోర్టు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే మిలటరీ అవసరాలకు సైతం ఉపయోగపడుతుందనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అభయారణ్యం విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉంది. జిల్లాకు ఆనుకుని ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉండడంతో పాటు సమీపంలో ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దండకారణ్యం విస్తరించి ఉంది. సరిహద్దుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య నిరంతరం పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తే అత్యవసర సమయాల్లో మిలటరీ అవసరాలకు సైతం ఉపయోగపడుతుందని రెండు ప్రభుత్వాల ఆలోచనగా తెలుస్తోంది.    

మరిన్ని వార్తలు