హోరెత్తిన హన్మకొండ

23 Jun, 2019 02:36 IST|Sakshi
నిరసన ర్యాలీలో ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు , ప్లకార్డుతో విద్యార్థులు

పైశాచికత్వంపై రోడ్డెక్కిన ప్రజాసంఘాలు

చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని శిక్షించాలని డిమాండ్‌ 

ర్యాలీలు, రాస్తారోకోలతో ఉద్రిక్తత 

హన్మకొండ: నిరసనలతో హన్మకొండ హోరెత్తింది. తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం.. ఆపై హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆందోళనకారులు రోడ్డెక్కారు. ర్యాలీలు, రాస్తారోకోలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఒక దశలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం కూడలి, కాళోజి కూడలి, అంబేడ్కర్‌ కూడలిలో విద్యార్థులు, యువకులు, మహిళలు, ప్రజా సంఘాలు వేలాదిగా చేరుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలిపాయి. కాళోజి కూడలిలో టైర్లు దగ్ధం చేయడం, కోర్టు ఎదుట ఆందోళన చేస్తున్న నిరసనకారులను పోలీసులు చెదరగొట్టే క్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు అటు వైపు రాకుండా పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్లు చెదరగొట్టారు.

మరోవైపు చిన్నారి శ్రీహితపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని వెంటనే ఉరితీయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం, పోలీసుల వైఫల్యాన్ని చేతకానితనంగా ఎండగడుతూ పెద్ద ఎత్తున జనం రోడ్డుపైకి వచ్చారు. హన్మకొండ చౌరస్తా నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ‘వీ వాంట్‌ జస్టిస్‌’.. సీఎం స్పందించా లంటూ నినాదాలు చేశారు.

ర్యాలీ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్దకు రాగానే పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకోగా అక్కడే రెండు గంటల పాటు కూర్చున్నారు. పోలీసులు శాంతింప జేసి శ్రీహిత తల్లిదండ్రులతో పాటు కొంత మంది బృందాన్ని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్‌ను కలసి వినతి పత్రం అందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

>
మరిన్ని వార్తలు