ముగ్గురు రైతుల బలవన్మరణం

5 May, 2015 23:17 IST|Sakshi

వరంగల్: అప్పుల బాధతో కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో మంగళవారం ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు..
కరీంనగర్ జిల్లా కాటారానికి చెందిన గోగుల రాజబాబు(26) గతేడాది మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతానికి వెళ్లి నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పెట్టుబడికి రూ.2 లక్షలు అప్పు చేశాడు.


కానీ, పంట పండలేదు. ఈ ఏడాది కాటారంలో మూడెకరాలు కౌలుకు తీసుకుని మళ్లీ పత్తి వేశాడు. పెట్టుబడి కోసం రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. మెుత్తం అప్పు రూ.3.50 లక్షలకు చేరింది. ఆశించిన మేర రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలని మనోవేదన చెందాడు. రాజబాబు మంగళవారం సమీప అటవీ ప్రాంతంలో ఉరేసుకున్నాడు. అతడికి భార్య శారద, కుమారుడు ఉన్నారు.


నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన ముక్కాంల లింగమ్మ (48), భర్త లింగయ్యతో కలిసి వ్యవసాయం చే స్తోంది. తమకున్న 5 ఎకరాలతోపాటు మరో 5 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, వరిని సాగు చేశారు. పెట్టుబడుల కోసం రూ. 3 లక్షల వరకు అప్పు చేశారు. పంట దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంట్లోనే పురుగులమందు తాగింది.


అలాగే, వరంగల్ జిల్లా ములుగు మండలం జంగాలపల్లికి చెందిన రేగుల ఊర్మిళ(35), సదయ్య దంపతులు భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. భర్త సదయ్య కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. ఊర్మిళ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. రబీలో నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకుని వరి సాగు చేసింది. పంట చేతికందే సమయంలో అకాల వర్షంతో పంట నేలవాలింది. దీంతో మనస్తాపానికి గురైన ఊర్మిళ సోమవారం రాత్రి వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది.

మరిన్ని వార్తలు