టీఎస్‌–ఐ‘పాస్‌’ కాలేదు!

30 Mar, 2018 02:26 IST|Sakshi

నెరవేరని సింగిల్‌ విండో లక్ష్యం..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం (టీఎస్‌–ఐపాస్‌) ద్వారా ‘సింగిల్‌ విండో’లక్ష్యం నెరవేరడం లేదని కాగ్‌ విమర్శించింది. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులకు కాకుండా.. వ్యాపారవేత్తలు కోరిన కొన్నింటికే ప్రభుత్వం అనుమతి పత్రాలు జారీ చేస్తోందని తప్పుబట్టింది. మరోవైపు అన్ని అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ తెలియజేసే కచ్చితమైన వ్యవస్థ కూడా లేదని పేర్కొంది. 2017 మార్చి–జూన్‌ మధ్య టీఎస్‌–ఐపాస్‌ పనితీరుపై పరిశీలన జరిపిన కాగ్‌.. అందులోని లోపాలు ఎత్తిచూపింది. ‘అన్ని రకాల అనుమతులకు దరఖాస్తు చేసుకున్నట్లు నిర్ధారించుకునేలా సాఫ్ట్‌వేర్‌లో వ్యవస్థ లేదు.

నుమతులకు తరువాత దరఖాస్తు చేసుకునేందుకు ‘అప్‌లై లేటర్‌’ఆప్షనూ లేదు. 2016–17లో 1,941 దరఖాస్తులొస్తే 177 మంది దరఖాస్తుదారులే అన్ని రకాల అనుమతులు కోరారు. మిగిలిన వారు పాక్షిక అనుమతులే పొందారు. పాక్షికంగా అనుమతులు తీసుకున్న పరిశ్రమలు యూనిట్లు ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించాయని నిర్ధారించుకునే వ్యవస్థ కూడా లేదు. కాలుష్య నియంత్రణ మండలి నుంచి రెడ్‌ కేటిగిరీ పరిశ్రమల ఏర్పాటుకు 148 పరిశ్రమలు అనుమతి పొందాల్సి ఉండగా, 85 పరిశ్రమలే దరఖాస్తు చేసుకున్నాయి. ఆరెంజ్‌ కేటగిరీ కింద 441 పరిశ్రమలకు గాను 175.. అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ కోసం 106 పరిశ్రమలకు గాను 9 మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. పంచాయతీల నుంచి ఎన్‌ఓసీ కోసం 1,425 పరిశ్రమలకు గాను 147 మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి’అని కాగ్‌ పేర్కొంది.  

మరిన్ని వార్తలు