పోలీస్‌ శాఖలో ‘వర్టికల్‌’ వర్కింగ్‌

30 Jul, 2018 03:03 IST|Sakshi

17 రకాలుగా పని విభజన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖలో ప్రతీ సిబ్బందికి వారు చేయాల్సిన పని, ఆ విధులు వారికి సంతృప్తి నిచ్చేలా ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించారు. పని ఒత్తిడి లేకుండా సిబ్బందికి పూర్తి స్థాయిలో సంతృప్తి అనిపించేలా వర్టికల్‌ వర్కింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అమలుచేసిన వర్టికల్‌ పని విభజనను రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ప్రతీ విభాగంలోని కింది స్థాయి సిబ్బంది నుంచి ఎస్పీ/ కమిషనర్‌ స్థాయి వరకు అందరికీ పోలీస్‌ శాఖ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది.

ఇందులో ప్రధానంగా ఎవరెవరు ఏం పని చేస్తున్నారు? వాటి పర్యవేక్షణ బాధ్యత ఎవరిది? పనితీరు మెరుగుపరచుకోవడంలో ఉండాల్సిన కీలక అంశాలేంటి? తదితర వాటిపై అన్ని జిల్లాల సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించింది. ప్రజల కు మరింత వేగంగా సేవలందించడంలో సిబ్బం ది సక్సెస్‌ అయ్యేందుకు వారికి ఎవరి పని వారుచేసేలా 17 రకాలుగా కార్యకలాపాలను విభజిం చింది. నిత్యం వారి విధి, అందులో పురోగతిని స్టేషన్‌ హౌజ్‌ అధికారి నుంచి రోజువారీ నివేదికలు పంపించాల్సి ఉంటుంది.
 
కేటాయించిన పనుల్లో మాత్రమే..

ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో రోజువారీ విధులు నిర్వ హించే సిబ్బందిని 17 రకాలుగా విభజించారు. ఇందులో ఉన్న సిబ్బంది/అధికారులు వారికి కేటాయించిన పనుల్లో మాత్రమే విధులు నిర్వహిస్తారు. ఎప్పటికప్పుడు వారు చేయాల్సిన పని, అందులో పురోగతి కోసం కృషి చేయాల్సి ఉంటుంది. దీంతో త్వరితగతిన కేసుల ఛేదింపు, స్టేషన్‌ మేనేజ్‌మెంట్, శాంతి భద్రతల పరిరక్షణ ఇలా అన్నింటిలో అధికారులు, సిబ్బంది సక్సెస్‌ అవుతారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.  

పని విభజనలో 17 అంశాలు..
1)రిసెప్షన్‌ స్టాఫ్‌ 2) స్టేషన్‌ రైటర్‌ 3) క్రైమ్‌ రైటర్‌ 4)బ్లూకోట్స్‌ 5) పెట్రోల్‌ స్టాఫ్‌ 6) కోర్టు వర్కింగ్‌ స్టాఫ్‌ 7) వారెంట్‌ స్టాఫ్‌ 8) సమన్స్‌ స్టాఫ్‌ 9) టెక్‌ టీమ్‌ 10)ఇన్వెస్టిగేషన్‌ స్టాఫ్‌ 11) క్రైమ్‌ స్టాఫ్‌ 12) మెడికల్‌ సర్టిఫికెట్‌ స్టాఫ్‌ 13)స్టేషన్‌ ఇన్‌చార్జి 14) జనరల్‌ డ్యూటీ స్టాఫ్‌ 15)డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ 16) స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ 17) అడ్మిన్‌ ఎస్‌ఐ  

మరిన్ని వార్తలు