ఆఫ్‌ క్యాంపస్‌లు అక్రమమే!

30 Jul, 2018 03:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అనుమతులు ఒకచోట.. తరగతులు ఇంకోచోట.. ఆఫ్‌ క్యాంపస్‌ల పేరుతో కొన్ని.. స్టడీ సెంటర్ల పేరుతో మరికొన్ని.. అనుమతులు లేకుండానే సర్టిఫికెట్లు జారీ చేస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, స్టడీ సెంటర్లు లక్షలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు లేకుండానే పలు సంస్థలు సాధారణ డిగ్రీలు, ఇంజనీరింగ్‌ కోర్సులను కొనసాగిస్తున్నాయని ప్రభుత్వానికి ఇటీవల భారీగా ఫిర్యాదులు అందాయి. వాటిపై ఏఐసీటీఈకి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో డీమ్డ్‌ యూనివర్సిటీలు కూడా సాంకేతిక విద్య కోర్సులు నిర్వహించేందుకు తమ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఏఐసీటీఈ ఈనెల 26న బహిరంగ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రంగంలోకి దిగింది. 

వివరణ కోరిన మండలి 
ఏఐసీటీఈ ఆమోదం లేకుండానే ఇతర రాష్ట్రాల్లో ఆఫ్‌ క్యాంపస్‌లు నిర్వహిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పలు విద్యా సంస్థల నుంచి వివరణ కోరింది. గీతమ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ క్యాంపస్, సింబయాసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ, అమిటీ, సింఘానియా, కేఎల్‌ యూనివర్సిటీ, ఇక్ఫాయ్‌ యూనివర్సిటీలకు లేఖలు రాసింది. 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపడుతున్న ఆయా సంస్థలకు ఏయే అనుమతులున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీ ఉందా.. ఏఐసీటీఈ అనుమతులున్నాయా.. యూజీసీ అనుమతి ఉందా.. తదితర అంశాలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. దీనిపై మూడు సంస్థలు ఇప్పటికే వివరణ ఇచ్చాయి. మరో మూడు విద్యా సంస్థల నుంచి వివరణ రావాల్సి ఉందని మండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. మిగతా విద్యా సంస్థల నుంచి వివరణ వచ్చాక అన్నింటినీ తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో సరైన అనుమతులు లేకుండానే కోర్సులను నిర్వహిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ వివరణ కోరడం చర్చనీయాంశంగా మారింది. 

ఇష్టారాజ్యంగా కోర్సుల నిర్వహణ 
అనుమతుల్లేకపోయినా కొన్ని ప్రైవేటు, డీమ్డ్‌ యూనివర్సిటీలు ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అలాంటి విద్యాసంస్థల్లో చేరి, విద్యార్థులు డబ్బుతో పాటు భవిష్యత్తును నష్టపోతున్నారు. డిసెంబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏఐసీటీఈ అనుమతితోనే సాంకేతిక విద్య కోర్సులు నిర్వహించాలన్న నిబంధన ఉన్నా ఆఫ్‌ క్యాంపస్‌ల పేరుతో ఇతర రాష్ట్రాల్లో కోర్సులను నిర్వహిస్తున్నాయి. కొన్ని రాష్ట్రస్థాయి యూనివర్సిటీలైతే సంప్రదాయ డిగ్రీలు, వివిధ కోర్సులను ఇతర రాష్ట్రాల్లో స్టడీసెంటర్ల ద్వారా నిర్వహించకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. స్టడీ సెంటర్ల పేరుతో లక్షలాది విద్యార్థులను మోసం చేస్తున్నాయి. పదోన్నతులు పొందేందుకు అలాంటి చెల్లని సర్టిఫికెట్లు పెట్టిన వారు వివిధ శాఖల్లో అనేక మంది ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా తూనికలు, కొలతల శాఖలో చెల్లని సర్టిఫికెట్ల గొడవ కొనసాగుతోంది. ఆ సర్టిఫికెట్లతోనే పదోన్నతులు ఇస్తున్నారంటూ ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. దీనిపై ఉన్నత విద్యామండలికి భారీగా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. 

‘గీతమ్‌ అనుమతికి దరఖాస్తు చేయలేదు’ 
గీతమ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ విశాఖపట్నం, హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఇంజనీరింగ్‌ కోర్సుల నిర్వహణ కోసం తమకు దరఖాస్తు చేయలేదని, ఆమోదం పొందలేదని ఏఐసీటీఈ రీజనల్‌ ఆఫీసర్‌ రమేశన్‌ ఉన్ని క్రిష్ణన్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన బీఎన్‌ శ్రీనివాస్‌ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోగా, ఈ మేరకు ఏఐసీటీఈ అధికారులు ఈనెల 25న రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీనిపై గీతమ్‌ వర్సిటీ వర్గాలను వివరణ కోరగా.. మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ), యూజీసీ, ఏఐసీటీఈ భాగస్వామ్యంతో కూడిన జాయింట్‌ కమిటీ ఆమోదం మేరకే తమ కోర్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నాయి. ప్రత్యేకంగా ఏఐసీటీఈ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపాయి. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరాడిస్తారో..  మాయం చేస్తారో?

గర్భసంచి ఆపరేషన్‌ కోసం వస్తే.. ప్రాణాలు పోయాయి

బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌!

ఈ దఫా 24 మాత్రమే..

‘సీసీ’ సక్సెస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అప్పుడు చాలా బాధనిపించింది’

తల్లికి తగ్గ తనయ

డేట్‌ ఫైనల్‌

నన్ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు

ఇస్మార్ట్‌ గాళ్‌ ఇన్‌?

కనుక్కోండి చూద్దాం