ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకిస్తాం: సంపత్‌కుమార్

28 Nov, 2014 02:06 IST|Sakshi
ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకిస్తాం: సంపత్‌కుమార్

22 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ:  కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్  
ఆ నలుగురికి కూడా..
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం నిర్ణయించినట్టు ఆ పార్టీ విప్ సంపత్‌కుమార్ తెలిపారు. గురువారం  ఆయన మాట్లాడుతూ, పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ శాసనసభ్యులు 21 మందితోపాటు, తమపార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న దొంతి మాధవరెడ్డికి కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ, విప్ జారీ చేసినట్టు  తెలిపారు.   టీఆర్‌ఎస్‌లో చేరిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, కనకయ్య, విఠల్‌రెడ్డి, రెడ్యానాయక్‌లకు కూడా విప్ జారీ చేసినట్లు చెప్పారు. శాసన మండలిలో కూడా ద్రవ్యవినిమయ బిల్లును వ్యతిరేకిం చాలని ఎమ్మెల్సీలందరికీ విప్‌జారీ చేసినట్టు ఆ పార్టీ శాసనమండలి సభ్యుడు ఎమ్మెస్ ప్రభాకర్ పేర్కొన్నారు.
 
 టీడీపీ కూడా..
 శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టనున్న ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని తెలుగుదేశం శాసనసభాపక్షం నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీచేసింది. గురువారం ఉదయం  ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో సమావేశమైన ఎమ్మెల్యేలు ద్రవ్యవినిమయ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించారు.    టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే లు తీగలకృష్ణారెడ్డి, తలసానిశ్రీనివాస్ యాదవ్, చల్లా ధర్మారెడ్డిలను ఇరుకున పెట్టవచ్చని టీడీపీ  ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు