పెను ప్రమాదం తప్పింది!

12 Mar, 2020 10:15 IST|Sakshi
బీటలు వారిన హాస్టల్‌ గోడ ,హాస్టల్‌ నుంచి వెళ్లిపోతున్న విద్యార్థినులు, వర్కింగ్‌ ఉమెన్స్‌

సెల్లార్‌ తవ్వుతుండగా కూలిన గోడ  

హాస్టల్‌ నిర్వాహకురాలికి తీవ్ర గాయాలు  

సెల్లార్‌ యాజమానులపై కేసులు  

హాస్టల్‌ ఖాళీ చేసిన విద్యార్థినులు,వర్కింగ్‌ ఉమెన్స్‌

మాదాపూర్‌: సెల్లార్‌ తవ్వడంతో హాస్టల్‌ గోడ కూలి ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. మాదాపూర్‌ పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్‌లోని పత్రికానగర్‌లో మంగళవారం రాత్రి 9.30  గంటల సమయంలో ఒక్కసారిగా సెల్లార్‌ పక్కనే ఉన్న గది గోడ కూలడంతో హాస్టల్‌లో ఉన్న వారందరూ భయభ్రాంతులకు గురయ్యారు. పత్రికానగర్‌లో  సాయిసంగమేశ్వర హాస్టల్‌ను నెల్లూరు జిల్లా పంగం గ్రామానికి చెందిన  శ్రీహరి అనే వ్యక్తి తల్లితో కలిసి మూడేళ్లుగా పీజీ ఉమెన్స్‌ హాస్టల్‌ను నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా హాస్టల్‌ పక్కనే భవన నిర్మాణం చేసేందుకు సెల్లార్‌ను తీస్తున్నారు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు హాస్టల్‌కి అదనంగా ఉన్న గది గోడ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో గదిలో నిద్రిస్తున్న నిర్వాహకులు వెంకటమ్మకు   తీవ్రగాయాలయ్యాయి. రెండు చేతులు, వెన్నెముక దెబ్బతిన్నాయి. మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో  ఆమె చికిత్స పొందుతోంది. 

హాస్టల్‌ ఖాళీ..
హాస్టల్‌ కింది భాగమంతా బీటలు వారడంతో ప్రమాదకరంగా మారింది. ఇందులో ఉన్నవారిని ఖాళీ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆదేశించారు. దీంతో దాదాపు 70 మంది విద్యార్థినులు, వర్కింగ్‌ ఉమెన్స్‌ లగేజ్‌లు తీసుకొని వెళ్లిపోయారు. అనంతరం  జీహెచ్‌ఎంసీ అధికారులు వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు స్థల యాజమానులపై కేసులు నమోదు చేశారు. యాజమానులు కాసు శైలజారెడ్డి, కాసు దినేష్‌రెడ్డి, సెక్షన్‌ ఇంజనీర్‌ రాజరాం తివారీ, టెక్నికల్‌ శ్రీశైలంలపై కేసులను నమోదు చేశారు. ఇలాంటి సెల్లార్‌లను తీసే సమయంలో ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇస్తూ చుట్టుపక్కల వారికి కూడా సమాచారం ఇవ్వాలి. అలాంటివి ఏమి చేయకుండా సెల్లార్‌లను తవ్వినట్లు అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు